దేశ ప్రజలు కరోనాతో అతలాకుతలం అవుతుంటే కొందరు వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు. సిల్లీ మాటలతో జనాలకు కోపం తెప్పిస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ కరోనా వైరస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ డెహ్రాడూన్‌లో ఓ సమావేశంలో కరోనాపై మాట్లాడారు. వైరస్ కూడా మనలాంటి జీవేనని, దానికి జీవించాలని ఉంటుందని చెప్పారు. దాని ఉనికిని కాపాడుకునేందుకే రూపాలు మారుస్తోందన్నారు. దానికి కూడా జీవించే హక్కు ఉందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై వెల్లువలా విమర్శలు వస్తున్నాయి. జనాలు చస్తుంటే లెక్కలేని మాటలేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఆయన ఇలా మాట్లాడటమేంటని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా త్రివేంద్ర సింగ్ రావత్ గత మార్చిలో సీఎం పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ బీజేపీ నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఉత్తరాఖండ్ సీఎంగా తీర్థ్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు.