అమరావతి, ఆంధ్రప్రభ: రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ట్రిపుల్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాకు ప్రస్తుతం ఉన్న టిక్కెట్ ధరలపై అదనంగా రూ.75 పెంచుకొనే వీలు కల్పించినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ సినిమాకు హీరో,హీరోయిన్, దర్శకుడి రెమ్యునేషన్, కాకుండా రూ.336 కోట్లు నిర్మాణ వ్యయం అయిందని రాజమౌళి దరఖాస్తు ద్వారా తమ దృష్టికి తెచ్చారన్నారు. జీఎస్టీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హోం సెక్రటరీ పరిశీలన చేసి అనంతరం ప్రతి తరగతి టిక్కెట్ ధరపై రూ.75 అదనంగా పెంచుకొనే వీలు కల్పించడం జరిగిందన్నారు. మొదటి పది రోజులు మాత్రమే టిక్కెట్లకు అదనపు ధరలు వసూలు చేయాలన్నారు. జీవో 13 ప్రకారం వంద కోట్ల రూపాయల పైన ఖర్చయ్యే సినిమాలకు టిక్కెట్ రేటుపై అదనంగా వసూలు చేసుకొనే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. సినిమా నిర్మాతలు నష్టపోకుండా, ప్రజలపై భారం పడకుండా ఉండేలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
జీవో 13 వచ్చే సరికి నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలకు రాష్ట్రం 20 శాతం షూటింగ్ చేయాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతిరోజు ఐదు షోలు ప్రదర్శించుకొనే వీలు కల్పించడం జరిగిందన్నారు. పెద్ద సినిమా విడుదలైన రోజే చిన్న సినిమా విడుదలైతే ఐదు షోల్లో ఒక షో పదర్శించడానికి చిన్న సినిమాకు అవకాశం ఇవ్వాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు చిన్న సినిమా ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలన్నారు. రూ.20 కోట్ల బ డ్జెట్ లోపు ఉన్నవన్నీ చిన్న సినిమాలుగా పరిగణించడం జరుగుతోందని మంత్రి పేర్నొ వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా సినిమా టిక్కెట్ల విక్రయానికి సంబంధించి రెండు సంస్థల నుంచి టెండర్లు వచ్చాయన్నారు. త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ లేదా మే నెల నుంచి ఆన్లైన్ ద్వారా టిక్కెట్ల విక్రయ విధానం అమల్లోకి వస్తోందన్నారు. ముందురోజు కలెక్షన్ మొత్తాన్ని మరుసటి రోజు ఉదయం 11 గంటలకు డిస్టిబ్యూటర్లకు అందజేయడం జరుగుతోందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..