ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు పట్టిన గతే పడుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ విమర్శించారు. ప్రజలు తిరుగుబాటు చేయడంతో రాజపక్సే పలాయనం చిత్తగించిన విషయం తెలిసిందే. సోమవారంనాడు కోల్‌కతాలోని సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానించని నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న టీఎంసీ ఎమ్మెల్యే ఈ విమర్శలు చేశారు. సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరవుతున్నారు.
మెట్రో ప్రాజెక్టుకు చొరవ చూపిన మమతా బెనర్జీ గతంలో రైల్వేశాఖ మంత్రిగానూ పనిచేశారని, అలాంటి నేతను విస్మరించడం అన్యాయమని వారు అధికారపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో విక్టోరియల్ మెమోరియల్‌లో జరిగిన అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేవారిలో సీఎం మమతా బెనర్జీ పేరును తొలగించిన విషయం తెలిసిందే. కాగా, తృణమూల్ నేతల విమర్శలను బీజేపీ కొట్టి పారేసింది. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు బీజేపీ నేతలను ఆహ్వానించని అధికార తృణమూల్ కాంగ్రెస్సే ఈ సంప్రదాయనికి నాంది పలికిందని తిప్పికొట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.