తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సేవ చేశారు
మహిళల కోసం గళమెత్తిన ఉద్యమకారిణి
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ నివాళి
ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :
సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి ట్విట్ చేస్తూ .. స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శం అన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమని అన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిందన్నారు.
మహిళల విద్య కోసం..
స్త్రీ విద్యపై మొట్టమొదటిసారి గళమెత్తిన ఉద్యమకారిణి అని, మహిళల విద్య కోసం ఎంతోగానో శ్రమించిన దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. తన జీవితాన్ని మహిళలకు విద్య అందించడం కోసం, మహిళా సాధికారత కోసం అంకితం చేసిన ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు అని కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎక్స్ ఖాతా ద్వారా ఘన నివాళులు అర్పించారు.