Friday, November 22, 2024

ట్రిబ్యునల్ అవార్డును గెజిట్‌లో ప్రచురించాలి, కరువుపీడిత ప్రాంతాలకు నీళ్లివ్వాలి.. సుప్రీంకోర్టులో కర్ణాటక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కృష్ణా నది జలాల్లో వాటాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డును వెంటనే గెజిట్లో ప్రచురించేలా ఆదేశాలివ్వాలని కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టును కోరింది. మంగళవారం కృష్ణాజలాల వివాదంపై దాఖలైన పిటిషన్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఈ తరుణంలో తమది రెగ్యులర్ బెంచ్ కాదని, స్పెషల్ బెంచ్ అని విచారణ జరిపేందుకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. అయితే కర్ణాటక తరఫు న్యాయవాది విచారణ జరపాలని పట్టుబట్టడంతో, మిగతా కేసుల విచారణ పూర్తయ్యాక చేపడతామని చెప్పింది. భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమవగా.. 2010 డిసెంబర్లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల్లో మిగుల జలాలను 65% లభ్యత ఆధారంగా లెక్కగట్టి వాటాలు నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 448 టీఎంసీల మిగులు జలాల్లో మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 173, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను కేటాయించిందని చెప్పారు. ఈ అవార్డు ప్రకటించి పదేళ్లు దాటినా ఇప్పటికీ గెజిట్లో ప్రచురించకపోవడంతో తమ వాటా మిగుల జలాలను వినియోగించుకోలేకపోతున్నామని వెల్లడించారు. 2050 వరకు అమల్లో ఉండేలా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించిందని, అందులో విలువైన పదేళ్ల కాలం వృధాగా గడచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటకలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి అందించేందుకు తాము రూ. 13,321 కోట్లతో ప్రాజెక్టు, కాలువలు నిర్మించామని, ట్రిబ్యునల్ అవార్డును కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. కర్నాటకకు మిగులు జలాల్లో 173 టీఎంసీల వాటాలో కేవలం 75 టీఎంసీలను వాడుకునే సామర్థ్యంతోనే ఈ నిర్మాణాలు చేపట్టినట్టు ఆయన వివరించారు. రైతులు ఎంతో ఆశగా నీటి కోసం ఎదురుచూస్తున్నారని, ఆ ప్రాంతాలకు నీరు అందితే కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, యావత్ ముఖచిత్రమే ఆర్థిక వృద్ధి చోటుచేసుకుంటుందని తెలిపారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు అంశాన్ని తాము ట్రిబ్యునల్ నిర్ణయానికే వదిలేశామని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న వివాదంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పంపిణీలోనే వివాదం నెలకొందని, దానికి కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధం లేదని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటామని, అప్పటి వరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డును కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరారు.

కర్ణాటక వాదనతో తెలంగాణ రాష్ట్రం విబేధించింది. కోర్టు తుదితీర్పు వెలువడే వరకు ట్రిబ్యునల్ అవార్డును గెజిట్‌లో ముద్రించడం తగదని వాదించింది. గెజిట్‌లో ముద్రించవద్దంటూ సుప్రీంకోర్టు 2011లోనే మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి గుర్తుచేశారు. ఎగువ రాష్ట్రంగా ఉన్న కర్ణాటక కేటాయింపుల్లో స్పష్టత రాకముందే ప్రాజెక్టులు కట్టుకుని, మొత్తం నీటిని వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కర్ణాటక చెబుతున్న ప్రాజెక్టు మిగుల జలాల్లో వాటా ఆధారంగా నిర్మించారని, ఈ పరిస్థితుల్లో మిగులు జలాల లెక్కలు తేలిన తర్వాతనే ట్రిబ్యునల్ అవార్డును గెజిట్‌లో ప్రచురించాలని సూచించారు. ఇరుపక్షాల వాదనలతో కోర్టు సమయం ముగియడంతో ధర్మాసనం కేసు విచారణ వాయిదా వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement