న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరామని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో ఆలిండియా బంజారా ఆర్గనైజేషన్ మంగళవారం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ సెమినార్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రపతిని కలిసి 40 లక్షల గిరిజన తరఫున శుభాకాంక్షలు తెలిపామన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరామని, విభజన అనంతరం తెలంగాణలో గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు.
టీఆర్ఎస్, బీజేపీలు గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని రాష్ట్రపతికి వివరించామని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపామంటుంది, కేంద్రం రాలేదంటూ ఆడుతున్న నాటకాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. 50 శాతం కంటే అదనంగా 10 శాతం ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, గిరిజనులకు 4 శాతం రిజర్వేషన్లు పెంచేలా చొరవ తీసుకోవాలని కోరామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పోడు భూముల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను ఆటవికంగా ఖాళీ చేయిస్తున్న విషయాన్ని రాష్ట్రపతికి చెప్పామన్నారు. తండాలు గ్రామ పంచయితీలుగా మారిన చోట మౌలిక సదుపాయాలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
రిజర్వేషన్లు లేకపోవడం వల్ల గిరిజనులు నష్టపోతున్నారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ద్రౌపది ముర్ముకు చెప్పామన్నారు. అనంతరం రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు, డిమాండ్లు రాష్ట్ర పతికి వివరించామని స్పష్టం చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరామన్నారు. గిరిజనుల వేషధారణ గురించి రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.