వేసవి సెగలు చల్లారాయి. తొలకరి చినుకుల తుంపరుల పలకరింతతో జనం ఇప్పుడిప్పుడే పులకరిస్తున్నారు. కానీ, నెల రోజుల కిందట సూరీడి ప్రతాపాన్ని జనం మర్చిపోలేదు. హిమాలయాల చల్లని పిల్ల గాలులతో సేద తీరే హరియాణా, చండీగఢ్ సహా ఉత్తరాదిలో భానుడు చెలరేగిపోయాడు. హరియాణాలో పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. ఎండలు, వేసవి తాపానికి తట్టుకోలేక జనాలు విలవిల్లాడిపోయారు. ఇందుకు ప్రధాన కారణం.. పచ్చని చెట్లు మాయం కావటమే. హరిత వనాలు అంతరించటమే.
ఈ తీవ్ర సమస్యను ముందే గ్రహించిన ఓ యువ ట్రీమ్యాన్ పర్యావరణ పరిరక్షణ కోసం పదేళ్లుగా పాటుపడుతుంటే.. పని పాట లేని తనంగా భావించిన హరియాణా, చండీగఢ్ ప్రజలు.. ఇప్పుడు ఆ పర్యావరణ ప్రేమికుడి గాథను చెప్పుకొంటూ.. మనమూ మొక్కల మనుషులవుదాం అని ఓ నిర్ణయానికి వచ్చారు.
హరియాణా, చండీగడ్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో హరిత విప్లవానికి అంకురం మొలకెత్తుతోందంటే.. అతిశయోక్తి కానే కాదు. ‘ట్రీ మ్యాన్’ అవతరణ హరియాణా సోనిపట్ జిల్లాకు చెందిన దేవేంద్ర సురా. ఓ సాధారణ కుటుంబ జీవి. అతడి తండ్రి విశ్రాంత సైనికుడు. బాల్య దశలోనే మొక్కలపై మమకారం పెరిగింది. యవ్వన దశలో పకృతిని గాఢంగా ప్రేమించాడు. చండీగఢ్‌లో కానిస్టుబుల్ ఉద్యోగంలో చేరాడు. తన వృత్తి ధర్నాన్ని పాటిస్తూనే.. ప్రవృత్తిని వీడలేదు. తన జీవితాన్ని మొక్కల పెంపకానికే అంకితం చేశాడు.
2014 నుంచి పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. తన సొంత జిల్లా సోనిపట్‌లో నర్సరీని ఏర్పాటు చేశాడు. దానికి జనతా నర్సరీ అని పేరుపెట్టాడు. ఇలా మొక్కల పెంపకం… ఉచిత పంపిణీ వ్యవస్థకు పునాది పడింది. వాడ వాడలా మొక్కలను నాటే క్రతువు జోరందుకుంది. ఇదీ.. జనతా నర్సరీసభ్య సమాజంలో రుగ్మతలకు మరమత్తుల ఇతివృత్తంతో జనతా గ్యారేజీ సినిమా జనాన్ని అలరిస్తే.. పర్యావరణ సమస్యల మరమత్తులకు జనతా నర్సరీని దేవేంద్ర స్థాపించాడు.
జనతా గ్యారేజీ ఊహ్మాత్మకం.. జనతా నర్సరీ సజీవ యజ్ఞం. సోనీపట్, రహతక్, మహేంద్ర గఢ్, కర్నాల్ ప్రాంతాల్లో పర్యటించి యువకుల్లో పర్యావరణ రక్షణ చైతన్యాన్ని రగిల్చాడు కానిస్టేబుల్ దేవేంద్ర. ఆయనకు రెండే రెండు సైకిళ్లున్నాయి. వాటిపైనే నిత్య ప్రయాణం. సుదూర ప్రాంతాలకు వెళ్తే బస్సులు, రైళ్లల్లో గమ్యాన్ని చేరుతాడు. ఎక్కడ మొక్కలు కావాలంటే అక్కడకు ప్రత్యక్షం అవుతాడు. మొక్కలు లేని ప్రాంతాలను గుర్తించి.. అక్కడ మొక్కలు నాటుతాడు. ఏదో మొక్కుబడిగా మొక్కలు నాటటమే కాదు.. వాటి పెంపకం పైనా దేవేంద్ర దృష్టి సారించారు. పకృతి ప్రేమికులకు ఈ పనిని అప్పగించి వాటిని కాపాడేలా చూసుకుంటున్నాడు.. ఇలా ప్రతి ఏడాది వేలాది మొక్కలను నాటి.. చెట్లుగా పెంచుతున్నాడు.
గత పదేళ్లలో 2.25 లక్షలకు పైగా మొక్కలను నాటాడు. ఇప్పటి వరకు పలు బ్యాంకుల్లో ప్లాంటేషన్ కోసం రూ.35 లక్షల రుణం తీసుకున్నాడు. మొక్కల పెంపకానికి తన జీతాన్ని మొత్తం ఖర్చు చేస్తున్నాడు. కుటుంబ పోషణను రిటైర్డు జవాన్.. అతడి తండ్రి చూసుకుంటారు. ఇక పర్యావరణం, ప్రకృతి పరిరక్షణలో దేవేంద్ర సురా కృషికి 2023లో ఐఐటీ ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సత్కరించారు.