దసరా పండుగకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి రూ.11 లక్షల నగదు బహుమతులను గెలుపొందే అద్భుత అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. దసరాకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారు టికెట్ వెనకాల పూర్తి పేరు, ఫోన్ నంబర్ రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాలి. రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీడ్రా నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను అందించనున్నారు. ప్రతీ రీజియన్ కు ఐదుగురు మగాళ్లు, ఐదుగురు ఆడాళ్లు మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9,900 చొప్పున బహుమతులను అందించనున్నారు.
అక్టోబర్ 21-23, 28-30 తేదీల్లో..
ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు, 28 నుంచి 30 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ ను రాసి వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుష, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేయనుంది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను ఎంపికచేస్తారు. మొత్తం 11 రీజియన్ లలో కలిపి 110 మంది విజేతలను ఎంపిక చేస్తారు.
లక్కీ డ్రాలో పెద్ద ఎత్తున పాల్గొనాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
రాఖీ పౌర్ణమి స్ఫూర్తితో దసరా, దీపావళి, సంక్రాంతి, తదితర పండుగలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ప్రతీ బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేస్తుందని,రాఖీ పౌర్ణమి లాగే దసరా లక్కీ డ్రాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని టీఎస్ఆర్టీసీ ఆశిస్తోందన్నారు. దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్అర్టిసి కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.