Saturday, November 23, 2024

రైల్వేల ద్వారా మారుతీ కార్ల రవాణా.. 2.33లక్షల వాహనాల తరలింపు..

ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డ్‌ స్థాయిలో మారుతీ కార్లను రైల్వేల ద్వారా రవాణా చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న డీలర్‌ నెట్‌వర్క్‌కు వీటిని సరఫరా చేశారు. మారుతి తన ఉత్పత్తులను 2020-21లో లక్షా 89 వేల యూనిట్లను రైల్వేల ద్వారా రవాణా చేసింది. 2021-22 లో 23 శాతం అధికంగా 2 లక్షల 33 వేల యూనిట్లను రవాణా చేసింది. 8 సంవత్సరాల క్రితం వాహనాల రవాణా కోసం మారుతి సుజికీ, ఇండియన్‌ రైల్వేలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఎనిమిది సంవత్సరాల్లో రైల్వేల ద్వారా మారుతి 11 లక్షల వాహనాలను రవాణా చేసింది. రవాణాకు రైల్వేలను ఉపయోగించుకోవడం వల్ల 4,800 మెట్రిక్‌ టన్నుల కార్చన్‌డైఆక్సైడ్‌ను తగ్గించగలిగామని, 1,56,000 ట్రక్కుల వినియోగం తగ్గిందని, దీని వల్ల 174 మిలియన్‌ లీటర్ల డీజిల్‌ ఆదా అయిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

మారుతి కార్లను డీలర్ల నెట్‌వర్క్‌కు చేర్చడానికి వీలున్న అన్ని ప్రాంతాలకు రైల్వేలనే ఉపయోగించు కుంటున్నామని మారుతి సుజికీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ భారతీ తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 66 వేల యూనిట్ల రవాణాతో ప్రారంభమై , ఇప్పుడు 2.33 లక్షలకు చేరుకున్నామని తెలిపారు. రైల్వేల ద్వారా వాహనాల రవాణాను మరింత పెంచేందుకు గుజరాత్‌, హర్యానా ప్రభుత్వాలతో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు హన్సల్‌ పూర్‌, మనేసర్‌లో ఉన్న మారుతి ప్లాంట్ల వరకు రైల్వే లైన్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వేల్లో వాహ నాల రవాణా కోసం మారుతి సుజికీ 2013లో ఏఎఫ్‌టివో లైసెన్స్‌ పొందింది. మారుతి ప్రస్తుతం 41 రైల్వే రాక్‌లు కలిగి ఉంది. ఒక్కో ర్యాక్‌లో 300 వాహనాలను రవాణా చేయవచ్చు.

కంపెనీకి ఢిల్లి ఎన్‌సిఆర్‌ , గుజరాత్‌ ల్లో ఆరు లోడింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి బెంగళూర్‌, నాగపూర్‌, ముంబాయి, గౌహతి, ముంద్రా పోర్టు, ఇండోర్‌, కోల్‌కతా, చెన్నయ్‌, హైదరాబాద్‌, అహ్మదా బాద్‌, ఫరూఖ్‌నగర్‌, సిలిగురి, కోయంబతూర్‌, పుణె, అగర్తలా, సిల్చార్‌ వంటి 16 నగరాలకు రైల్వేల ద్వారా మారుతి వాహనాలను రవాణా చేస్తోంది. ఆగర్తలా, సిల్చార్‌ ప్రాంతాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈశాన్య రాష్ట్రాలకు కార్లను రవాణా చేసేందుకు 8 రోజులు పడుతుందని, గతంలో ఇది 16 రోజుల సమయం తీసుకునేదని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement