లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం 2019 ప్రకారం ట్రాన్స్‌జెండర్లకు సంభావ్య ఉపాధి అవకాశాలు, నియామకాలను నిర్ణయించడానికి భారత సాయుధ దళాలు ముందడుగు వేశాయి. వీరి నియామకాల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నాయి. అధికార వర్గాల ప్రకారం, ప్రిన్సిపల్ పర్సనల్ ఆఫీసర్స్ కమిటీ (పిపిఒసి) ఆగస్టు సమావేశం తర్వాత ఒక ఉమ్మడి అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. చట్టంలోని చిక్కులను చర్చించడం, రక్షణ దళాలలో వారి నియామకాల అమలుకు ప్రతిపాదనలు ఇవ్వడం ఈ బృందం కర్తవ్యం.
దీనికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (డిజిఎఎఫ్‌ఎంఎస్) లోని సీనియర్ అధికారి నాయకత్వం వహిస్తున్నారు. పిపిఒసి మొత్తం మూడు సేనలకు చెందిన సీనియర్ అధికారులతోపాటు ఎఎఫ్‌ఎంఎస్, సాయుధ దళాల ట్రై-సర్వీస్ మెడికల్ ఆర్గనైజేషన్‌తో కూడినది. దీనిపై చర్చలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నప్పటికీ, మెజారిటీ డైరెక్టరేట్‌లు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే పంపినట్లు తెలుస్తున్నది.
ఇతరుల మాదిరిగానే వీరికీ ఎంపిక, శిక్షణ నియమాలు వర్తింపజేయాలని కొందరు సూచించగా, మరికొందరు హౌసింగ్, ఇతర మౌలిక సదుపాయాల వంటి పరిపాలన, రవాణా సవాళ్లను లేవనెత్తినట్లు సమాచారం. అదేవిధంగా ఈ ట్రాన్స్‌జెండర్లకు జీవిత భాగస్వాములు ఉంటే, వారిని మిలటరీలో ఎలా గుర్తించాలి. ఇతర క్రియాశీలక సైనిక కుటుంబాలతో సాంస్కృతికంగా ఎలా కలసిపోతారు అనే చిక్కులపైనా ఆందోళనలు ఉన్నాయి. ప్రస్తతం ట్రాన్స్‌జెండర్లు లేదా స్వలింగ సంపర్కులకు సాయుధ దళాలలోకి ప్రవేశాలు లేవు.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల చట్టం ప్రకారం, ఇతర డొమైన్‌లతోపాటు ప్రభుత్వ సేవలు, ఆరోగ్యం, విద్య, ఉపాధి, ప్రయోజనాలలో వివక్ష, ఉంపాతాలు నివారించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అందుచేత త్వరలోనే సైన్యంలోకి వీరి నియామకాలు జరిగే అవకాశం ఉందని సదరు అధికారు తెలిపారు. ఆర్మీని కేవలం ఉపాధి అవకాశంగా చూడలేము. గృహాలు, మరుగుదొడ్లు లేకపోవడం, పరిపాలనపరమైన సవాళ్లు ఉన్నాయి. ప్రత్యేకించి వనరులు, స్థల కొరత ఉన్న క్షేత్రస్థాయిలలో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెప్పారు.