హైదరాబాద్ , ఆంధ్రప్రభ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోయిన ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్‌లను వాలంటీర్లుగా నియమించాలని ఆయన అధికారులకు సూచించారు.
హైదరాబాద్ నగర పోలీసులోని ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డులు ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. హొంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.
అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.