అమరావతి, ఆంధ్రప్రభ: వైద్యశాఖలో బది’లీలలు’ వెలుగు చూస్తున్నాయి. కొత్త జిల్లా కార్యాలయాలు ఏర్పాటును ఆసరాగా చేసుకొని కొందరు అధికారులు అవినీతికి తెరతీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా బదిలీలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల సంఖ్య పెంచిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లా కార్యాలయాలను అక్కడనే కొనసాగిస్తూ కొత్తగా జిల్లా ఏర్పడిన చోట నూతన కార్యాలయాన్ని ఏర్పాటు- చేసింది. నూతనంగా ఏర్పాటు-చేసిన కార్యాలయంలో పాత కార్యాలయంలోని సిబ్బంది తో రివర్స్ సీనియార్టీ ప్రాతిపదికన ఉద్యోగులను సర్దుబాటు- చేయమని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాలు జారీ చేసింది. రివర్స్ సినీయార్టీ ప్రకారం బదిలీలు చేయమని ఆదేశాలుండగా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో సందిట్లో సడేమియగా స్పౌజ్, డిప్యూటేషన్లు చకచకా కానిచ్చేశారని తెలుస్తోంది. కృష్ణాజిల్లా వైద్యశాఖాధికారి జోనల్ పరిధిలోని ఉద్యోగులకు ఇష్టారాజ్యంగా బదిలీలు కట్టబెడుతున్నారని భోగట్టా. కృష్ణాలో జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం మచిలీపట్నం ఉన్నది. ఎన్టీఆర్ కృష్ణాజిల్లా ఏర్పడడంతో మచిలీపట్నం స్థానములో ఉన్న జిల్లా వైద్య శాఖ అధికారి కృష్ణా మచిలీపట్నం కొనసాగిస్తూ అదనంగా ఎన్టీఆర్ జిల్లా జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయాన్ని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు.
ఉమ్మడి కృష్ణా డీఎంఅండ్‌హెచ్‌ఓగా వ్యవహరించిన అధికారి రెండు జిల్లాలకు పోస్టులను బదిలీలు చేయడంతోపాటు జోనల్ కేడర్లకు సంబంధించిన ఉద్యోగుల వివరాలను కూడా రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ రాజమండ్రి మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ కు పంపినట్లు తెలుస్తోంది. కృష్ణాతో పాటు ఎన్టీఆర్ విజయవాడ, ఏలూరు జిల్లాలలకు సంబంధించిన డిఎంఅండ్హెచ్‌ఓ కార్యాలయాల్లో కూడా నిబంధనల ప్రకారం కొంతమంది స్టాప్ ను ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాలకు జరిగిన బదిలీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. చార్జి మెమో ఉన్న ఉద్యోగుల్ని బదిలీ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఏలూరు జిల్లాకు కు ఒక సీనియర్ అసిస్టెంట్ ను బదిలీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..