Tuesday, November 26, 2024

కేసు పూర్తయ్యాకే టీచర్ల బదిలీలు! స్పష్టం చేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ఉత్కంఠకు సోమవారంతో తెరపడుతుందనుకున్న ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. మళ్లి కేసు వాయిదా పడిండి. జూలై 11 వరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే పొడిగించింది. జూలై 11 వరకు స్టేని పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల బదిలీలకు అవకాశమివ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేయగా దానికి కోర్టు స్పందిస్తూ.. అలా ఎలా చేస్తారు.. కేసు పూర్తయ్యాకే బదిలీలు చేయాలని చీఫ్‌ జస్టీస్‌ స్పష్టం చేశారు.

30 ఏళ్లపాటు ఒకే చోట పనిచేసినవారు ఉన్నారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బదిలీలు, పదోన్నతులు ప్రభుత్వానికి అత్యంత ఆవశ్యకమని, వెంటనే స్టే వెకెట్‌ చేసి బదిలీలు, పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోర్టుకు అడిషనల్‌ ఏజీ రామచంద్రారావు ఈమేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దీంతో ఒక్కొక్క ఉపాధ్యాయుడు 20..30 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్‌లో పనిచేస్తున్నారు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. కేసు పూర్తి అయ్యేంత వరకు బదిలీలు చేపట్టొద్దని ఈనెల 11వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

మరోవైపు ఈ కేసు విచారణ కొలిక్కి వచ్చి బదిలీలకు మార్గం సుగమం అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ దంపతులకు తీవ్ర నిరాశే మిగిలింది. 18 నెలలుగా ఎదురుచూపులే తమకు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలు ఉన్నా బదిలీలకు తాము నోచుకోవడంలేదని 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులు వాపోతున్నారు. 33 జిల్లాల్లో 20 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపుతుల స్పౌజ్‌ బదిలీలు జరిగినా మిగతా జిల్లాలకు సంబంధించి పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. కోర్టు బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే తాము ఒకేచోటుకు బదిలీలవుతామని ఆశగా ఎదురుచూశారు.

కానీ కోర్టు కేసును వాయిదా వేయడంతో సమస్య మళ్లి మొదటికే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపడానికి అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నాయని స్పౌజ్‌ ఉపాధ్యాయ ఫోరం నేతులు చెబుతున్నారు. స్పౌజ్‌ బదిలీలు జరపకపోవడంతో భర్త ఒక చోట, భార్య మరోచోట, చదువుల కోసం పిల్లలు హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత ఆలస్యం…!

బదిలీల కేసు ఇప్పటికే ఐదు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ కేసు కొలిక్కి రావాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఒకేచోట 30 ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి బదిలీలపై స్పష్టత వచ్చినాకానే స్టే వెకెట్‌ చేసే వీలుందని ఉపాధ్యాయులు అంచనా వేసుకుంటున్నారు. ఈక్రమంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లిd మొదలు కావాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పట్లో బదిలీలు అవ్వడం కష్టమేనని ఉపాధ్యాయులు నైరాశ్యంలో ఉన్నారు. పదోన్నతుల కోసం దాదాపు 10 వేల మంది టీచర్లు ఎదురు చూస్తుంటే.. బదిలీల కోసం దాదాపు 73వేల మంది ఉపాధ్యాయులు నిరీక్షిస్త్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement