Friday, November 22, 2024

ఆ పిటిషన్లు అన్నీ సుప్రీంకే ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. స్వలింగ సంపర్కుల వివాహాలపై కీలక నిర్ణయం

స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏకం చేసిన పిటిషన్లన్నింటిపైనా ఫిబ్రవరి 15లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

ఈ పిటిషన్లపై తదుపరి విచారణను మార్చికి వాయిదా వేసింది. పిటిషనర్‌ విచారణకు ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయిన పక్షంలో.. వర్చువల్‌ పద్ధతిని ఉపయోగించుకోవచ్చని సూచించింది. పిటిషనర్లు, కేంద్రం ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. అంతకుముందు స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలంటూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఆరు వారాల్లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను చెప్పాలని సూచించింది. ఢిల్లి హైకోర్టులో సంబంధిత కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఢిల్లి హైకోర్టులో ఈ కేసు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఇది చాలా ముఖ్యమైన అంశమని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కేసు ప్రభావం చూపుతుందని అన్నారు. తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. స్పందించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement