Tuesday, November 26, 2024

Delhi | బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎక‌రాలు బదిలీ చేయండి : సీఎం రేవంత్

హైద‌రాబాద్‌లో ఈసా, మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లంలోని బాపూ ఘాట్ అభివృద్ధికి ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని 222.27 ఎక‌రాల భూమిని రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

మ‌హాత్మా గాంధీ చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూ ఘాట్ ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఢిల్లీలో రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లిశారు.

బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ సిద్దాంతాల‌ను ప్ర‌చారం చేసే నాలెడ్జ్ హ‌బ్‌, ధ్యాన గ్రామం (మెడిటేష‌న్ విలేజ్‌), చేనేత ప్ర‌చార కేంద్రం, ప్ర‌జా వినోద స్థ‌లాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్ర‌హం (స్టాట్యూ ఆఫ్ పీస్‌), మ్యూజియంల‌తో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టనున్నామ‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. ఇందుకోసం ర‌క్ష‌ణ శాఖ భూమిని బ‌దిలీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

సీఎం కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన కార్య‌క్ర‌మాల్లో ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, ఎంపీలు చామ‌ల కిర‌ణ్‌ కుమార్ రెడ్డి, కె.ర‌ఘువీర్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, ఆర్‌.రఘురామిరెడ్డి, డాక్ట‌ర్ క‌డియం కావ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement