హైదరాబాద్, ఆంధ్రప్రభ : యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత, అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ముందుకెళ్లేలా ఉండాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యలో ప్రమాణాల పెంపుపై దృష్టిసారించింది. ఇందుకు వర్సిటీల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లకు శిక్షణనివ్వాలని నిర్ణయించింది. గత సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇలా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లకు శిక్షణనివ్వాలని నిర్ణయించడం ఇదే తొలిసారి. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 20, 21, 22వ తేదీల్లో మూడు రోజుల పాటు జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఈ శిక్షణ తరగతలు నిర్వహించాలని నిర్ణయించారు. సీనియర్ ఆచార్యులకు పరిపాలన, వర్తమాన టెండ్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ తదితరవంటి అంశాల్లో మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహా ఇతర ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన నిపుణులు సలహాలు, సూచనలు వారికి ఇవ్వనున్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యలో పనిచేస్తున్న టీ-చర్లకు ఏటా విద్యాశాఖ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. అంతేకాకుండా వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తూ.. టీచర్లను ఎప్పటికప్పుడు సానపెడుతోంది. అయితే ఇలా వర్సిటీల్లోని ఆచార్యులకు శిక్షణనిలిచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. వర్సిటీల్లో కొన్ని అంశాలపై సామర్థ్యాల పెంపుపై శిక్షణలను నిర్వహిస్తున్నారు.
కానీ ప్రణాళికబద్ధంగా ఉన్నత విద్యలో పనిచేస్తున్న ఆచార్యులకు రాష్ట్రస్థాయిలో ఎలాంటి శిక్షణనిచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో అన్ని వర్సిటీ-ల ఆచార్యులకు శిక్షణనివ్వాలని ఉన్నత విద్యామండలి పాలకమండలి నిర్ణయించింది. సెప్టెంబర్‌లో శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణను పూర్తి చేసిన తర్వాత ఇంకోసారి కూడా శిక్షణనిస్తామని ఆయన పేర్కొన్నారు.