Tuesday, September 17, 2024

Trainee IAS – విర్ర‌వీగింది… జీవిత‌కాలం వేటు ప‌డింది..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ తర్వాత యూపీఎస్పీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆమె భవిష్యత్ అంధకారమైంది. ఐఏఎస్ ఉద్యోగం వచ్చాక వివేకంగా ప్రవర్తించకుండా.. గొంతెమ్మ కోర్కెలు కోరి.. లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్యూరోక్రట్‌గా ఈమె చరిత్రలో నిలిచిపోతుంది.

ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ ఎంపిక రద్దు చేస్తూ బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఆమె పరీక్షకు హాజరైన ప్రతిసారి నకిలీ పత్రాలు సృష్టించి హాజరైనట్లుగా గుర్తించింది. ఆమె పేరుతో పాటు.. తల్లిదండ్రుల పేర్లు కూడా పలుమార్లు మార్చేసినట్లుగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో కూడా ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 30 వరకు సమయం ఇచ్చింది. గడువులోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. కానీ ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది.

- Advertisement -

బ్యాగ్రౌండ్ ఇదే..

2023 బ్యాచ్‌కు చెందిన పూజా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఆలిండియా వైడ్‌గా 841 ర్యాంక్ సంపాదించింది. దీంతో ట్రైనీ ఐఏఎస్‌గా.. సొంత ప్రాంతమైన పూణెలోనే పోస్టింగ్ పడింది. ఆనందంగా రెండేళ్ల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకోవల్సిన ఆమె.. హద్దులు దాటింది. ఉన్నతమైన పోస్టుకు ఎంపికైనా.. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం.. ఆమెకు రుచించలేదు. అంతే పూణె కలెక్టరేట్‌లో సకల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి హుకుం జారీ చేసింది. అంతేకాకుండా సెలవుపై వెళ్లిన అదనపు కలెక్టర్.. కార్యాలయాన్ని ఆక్రమించుకుని.. తన నేమ్ ఫ్లేట్.. తన వస్తువుల్ని తెచ్చుపెట్టుకుంది. ఆడికారు.. దానిపై ఎర్ర లైటు.. కారుపై మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసిపెట్టుకుని నానా హడావుడి చేసింది. పూజా చర్యలపై విసుగెత్తిన.. పూణె కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను వాషిమ్‌కు బదిలీ చేశారు.

ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఆమె నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. చదువు దగ్గర నుంచి క్యాష్ట్, రేషన్ కార్డు.. ఇలా అన్ని సర్టిఫికెట్లు నకిలీ సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆమె శిక్షణ కాలాన్ని యూపీఎస్సీ నిలిపివేసింది. అంతేకాకుండా ఈనెల 30లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బుధవారం పూజాపై కఠిన చర్యలు తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వంతో పాటు భవిష్యత్‌లో పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement