Saturday, November 23, 2024

Tragic End – టైటానిక్ టూర్ కథ విషాదాంతం – స‌ముద్రంలో పేలిపోయిన సబ్‌మెర్సిబుల్

బోస్టన్‌: టైటానిక్‌ షిప్ శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల టైటాన్‌ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్‌ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. టైటాన్‌ను వెతికేందుకు సముద్ర గర్భంలోకి పంపించిన రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికిల్‌ (ఆర్‌వోవీ) సహాయంతో మునిగిన టైటానిక్‌ నౌక సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్టు వెల్లడించింది. టైటానిక్‌ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో టైటాన్‌ శకలాలు ఉన్నట్లు పేర్కొంది.

అట్లాంటిక్‌ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్‌ శకలాలను చూడటానికి టూరిస్ట్‌ సంస్థ ఓషియన్‌గేట్‌ పంపిన ‘టైటానిక్‌ సబ్‌ మెర్సిబుల్‌’ (మినీ జలాంతర్గామి) ఆదివారం రాత్రి గల్లంతైంది. దీంతో అప్రమత్తమైన అమెరికా, కెనడా రక్షణ బృందాలు . టైటాన్‌ ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న చోట ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకి దించారు. అయితే గల్లంతైన సబ్‌మెర్సిబుల్‌ తీవ్రమైన ఒత్తిడి వల్ల పేలిపోయిందని, అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు చనిపోయారని అమెరికన్‌ కోస్ట్‌గార్డ్‌ నిర్ధారించింది. కాగా, ఈ సాహసయాత్రలో పాల్గొనేందుకు ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు రూ.రెండు కోట్లు వసూలు చేశారు.
అంతకుముందు టైటాన్‌ మినీ సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న తమ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి స్టాక్టన్‌ రష్‌, ఆయనతోపాటు వెళ్లిన షెహ్జాదా దావూద్‌, సులేమాన్‌ దావూద్‌, హమీష్‌ హర్డింగ్‌, పాల్‌ హెన్రీ నార్గెలెట్‌ ప్రాణాలతో లేరని ఓషన్‌గేట్‌ ఎక్స్‌పెడిషన్స్ సంస్థ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement