Friday, November 29, 2024

Tragedy – విషాదంగా విహార యాత్ర – జ‌ల‌పాతంలో ముగ్గురు మెడికోలు దుర్మ‌ర‌ణం

ఏలూరు – జలపాతంలో దిగి సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులు కళ్లముందే కొట్టుకుపోయారు.. ఉన్నట్టుండి నీటి ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు. తోటి విద్యార్థులు అతికష్టమ్మీద ఇద్దరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాజమండ్రిలోని పర్యాటక ప్రదేశం మారేడుమిల్లిలో ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలను అధికారులు సోమవారం ఉదయం నీటి లోంచి బ‌య‌ట‌కు తీశారు.. గల్లంతైన మరో విద్యార్థి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.

విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఆదివారం మారేడుమిల్లికి విహారయాత్రకు వచ్చారు. అందరూ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇందులో పదిమంది అమ్మాయిలు కాగా నలుగురు అబ్బాయిలు ఉన్నారు. మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతంలో విద్యార్థులు సరదాగా ఈత కొట్టారు. ఈ క్రమంలోనే భారీ వర్షం కురవడంతో జలపాతంలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నీళ్లలో ఉన్న సీహెచ్ హరదీప్, కే సౌమ్య, బీ అమృత‌, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ప్రవాహంలో కొట్టుకుపోయారు.

ఇది గమనించి మరికొందరు విద్యార్థులు నీళ్లలోకి దిగి హరిణిప్రియ, గాయత్రిపుష్పలను అతికష్టమ్మీద ఒడ్డుకు చేర్చారు. వారిని హుటాహుటిన రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయిన విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి విద్యార్థుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్వతీపురం జిల్లా బొబ్బిలికి చెందిన సౌమ్య, బాపట్లకు చెందిన అమృత మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మరో యువకుడు హరదీప్ ఆచూకీ ఇంకా దొరకలేదని వివరించారు. కాగా, హరిణిప్రియ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో రంపచోడవరం ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement