మెక్సికో సిటీ: ఓ చర్చి పైకప్పు కూలిన ఘటన లో 10 మంది మృతి చెందారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద 30 మందికిపైగా చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అంచనావేశారు. మెక్సికో లోని తామౌలిపాస్ రాష్ట్రం సియుడాడ్ మదెరో నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 100 మంది స్థానికులు ఇక్కడి శాంటాక్రూజ్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు. అదే సమయంలో చర్చి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.
ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. మరో 60 మంది గాయపడి.. చికిత్స పొందుతున్నారన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. నిర్మాణపర లోపాలతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మెక్సికన్ కౌన్సిల్ ఆఫ్ బిషప్స్.. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసింది.