Friday, November 22, 2024

లడఖ్‌లో విషాదం, నదిలో పడ్డ వాహనం.. ఏడుగురు జవాన్ల దుర్మరణం..

శ్రీనగర్‌:సైనికులతో వెడుతున్న వాహనం అదుపుతప్పి నదిలో పడిపోయిన దుర్ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. లడఖ్‌ ప్రాంతంలోని పర్తాపూర్‌ కేంద్రం నుంచి హనీఫ్‌ ప్రాంతానికి 26మంది సైనికులతో వెడుతూండగా వాహనం పట్టుతప్పి పక్కనే ఉన్నషియోక్‌ నదిలోకి జారిపోయింది. దాదాపు 60 అడుగుల ఎత్తునుంచి దిగువకు పడిపోవడంతో అందులోని సైనికుల్లో ఏడుగురు మరణించారు. మిగిలిన అందరూ తీవ్రంగా గాయపడ్డారు. థోయిస్‌ ప్రాంతానికి 25 కి.మి దూరంలో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సహాయక కార్యక్రమాలను చేపట్టి సైనికులందరినీ పర్తాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని, మిగతా అందరికీ తీవ్ర గాయాలయ్యాయని, విషమంగా ఉన్నవారిని అత్యవసర చికిత్స కోసం వెస్ట్రన్‌ కమాండ్‌కు ప్రత్యేక విమానంలో తరలిస్తామని సైన్యం ప్రకటించింది.

ప్రధాని సంతాపం..

లడఖ్‌ బస్సు ప్రమాదంలో భరతమాన ముద్దుబిడ్డలైన సైనికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడటం తనను కలచివేసిందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్న ఆయన క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement