దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ప్రేమ్ నగర్ లో ఓ ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున ఆ ఇంటిలోని ఇన్వర్టర్ లో మంటలు చెలరేగడంతో ఇల్లంతా పొగ కమ్మేసింది. ఆ మంటలు క్రమంగా సోఫాకు వ్యాపించగా.. పొగ మరింత ఎక్కువై.. పై అంతస్తులో నిద్రిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు ఊపిరాడక మరణించారు.
భర్త, భార్య, ఇద్దరు కుమారులు మరణించనట్లు స్థానికులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలో ఢిల్లీలో 5 అగ్నిప్రమాదాలు జరిగాయి. గత నెల 26న వివేక్ విహార్ ప్రాంతంలోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరగ్గా.. ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. జూన్ 6న మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగ్గా.. 50 మంది తృటిలో తప్పించుకున్నారు. జూన్ 9న నరేలా ప్రాంతంలోని ఒక ఆహారశుద్ధి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. వారంరోజుల క్రితం తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఇలా ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.