బంగ్లాదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. నౌకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి 40 మంది సజీవ దహనం అయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఝులోకఠి ప్రాంతంలోని నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝులోకఠి సమీపంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో దాదాపు 500 మంది ఉన్నారని తెలిపారు. ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదంజరిగింది.
నౌక మూడు అంతస్తులుగా ఉంది. ఒక్కసారిగా నౌకలోని మూడో అంతస్తు ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలో దూకగా.. మరికొందరు తోపులాటలో గాయపడి.. నిస్సాయస్థితిలో సజీవ దహనం అయినట్టు అధికారులు తెలిపారు. 100 మంది క్షతగాత్రులను బారిసాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పరిమితికి మించి ప్రయాణికులు నౌకలో ఉన్నారు. 310 మంది మాత్రమే కెపాసిటి ఉండగా 500 మంది దాకా నౌకలో జర్నీ చేస్తున్నట్టు సమాచారం.