Friday, November 22, 2024

నగరవాసులకు నరకం చూపిస్తున్న ట్రాఫిక్​ జామ్​.. అసలు ట్రాఫిక్​ ఫ్రీ సిటీ సాధ్యమయ్యేనా?

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు నిత్యం పెద్దపీట వేస్తున్నామని పోలీసులు, ప్రభుత్వ అధికారులు నిత్యం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కిలోమీటర్ల ప్రయాణం గంటల్లో సాగుతుండటం నిత్యం నగరరోడ్లపై ప్రస్తుతం కనిపిస్తుంది. సాధారణ రోజుల్లోనూ ట్రాఫిక్‌ అధికంగా ఉంటుంది. ఇక వీకెండ్‌లో అయితే చెప్పనక్కర్లేదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే నగరవాసులు సాయంత్రం వేళల్లో ఆలోచించాల్సిన పరిస్థితి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే సమయంలో, ట్రాఫిక్‌ పోలీసలు సరైన వ్యూహాన్ని అనుసరించకపోవడం వల్లే అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుందని నగరవాసులు చెబుతున్నారు.

సాయంత్రం 6నుంచి 10దాటే వరకు..

నగరంలో కరోనా తర్వాత అన్ని కార్యాలయాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ప్రధానంగా కొంతమేర ఐటీ కార్యాలయాలు కూడా తెరుచుకుంటున్నాయి. అన్ని కార్యాలయాల్లో పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేయడంతో, ఆఫీసులకు వెళ్లివచ్చేవారంతా స్వంత వాహనాల్లో వెళ్తున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కార్లు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణిం చేవారు పెరిగిపోతున్నారు. నగరంలో ప్రతిరోజు సాయంత్రం 6నుంచి రాత్రి 10గంటల వరకు అనేక ప్రాంతాల్లో ఎటూచూసినా ట్రాఫిక్‌ నరకం చూపి స్తుంది. అత్యధికంగా కార్లతో పాటు, ప్రైవేటు వాహనాలు, ట్రావెల్స్‌ బస్సులతో అన్ని రోడ్లు ట్రాఫిక్‌తో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికెళ్లాలంటే గంటల సమయం పడుతుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. యూటర్న్‌ల వద్దా, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. బైక్‌ మీద వెళ్లే వారి పరిస్థితి కూడా అదే ఉందని, గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిందేనని నేరుగా చెబుతున్నారు. ఈ తంతూ నిత్యం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మాదాపూర్‌, శేరిలింగంపల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలి, జేఎన్‌టీయూ, హైటెక్‌ సిటీ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ముసాపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ వరకు ఉంటుంది. సాయంత్ర వేళల్లో ట్రాఫిక్‌ పోలీసులు సరైన ప్రణాళికతో వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాఫిక్‌ ఏ రూట్‌లో ఎక్కువగా వస్తుందనే విషయాన్ని గుర్తించకపోవడం వల్లే, ట్రాఫిక్‌ అంతా ఒకేసారి రోడ్లపైకి చేరి, ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతుందని విశ్లేషిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement