- జాతియ రహదారిపై గంటలతరబడి ట్రాఫిక్ జామ్
సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం నుంచి సొంత వాహనాల్లో రోడెక్కారు.. దీంతో జాతీయ రహదారిపై రద్దీ విపరీతంగా పెరిగి శనివారం పూర్తిగా స్తంభించిపోయింది.
వరద ప్రవాహంలా వాహనాలు రావడంతో గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ప్రయాణం చేయాల్సిన దూరానికి మూడు, నాలుగు గంటలు సమయం పడుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా చౌటుప్పల్ లోని సర్వీస్ రోడ్ల మరమ్మతుల కారణంగా స్థానిక వాహనాలు సైతం జాతీయ రహదారిపై వెళ్లడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు తప్పలేదు. అదేవిధంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద 16 గేట్లు ఉండగా అందులో 10 గేట్లను విజయవాడ వైపు వెళ్లేందుకు అనుమతించగా మిగిలిన ఆరు గేట్లను హైదరాబాద్ వెళ్లే వాహనాలకు కేటాయించారు.
అయితే ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేందుకు అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తుండడంతో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి టోల్ ప్లాజా దాటేందుకు వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.