హైదరాబాద్, ఆంధ్రప్రభ: చరిత్ర పరిశోధనల్లో అద్భుత నిర్మాణాలు ఆవిష్కృతమవుతున్నాయి. వేలాది సంవత్సరాల నాటి చారిత్రిక ఆనావాళ్లు లభ్యం కావడంతో రాష్ట్ర చరిత్ర పునర్ లిఖించేందుకు పురావస్తు పరిశోధకులు దృష్టి సారించారు. హైదరాబాద్ శివార్లలో వేలాది సంవత్సరాల క్రితమే మానవుని ఉనికిని తెలిపే ఆనవాళ్లు చరిత్రకారుల మేద సంపత్తికి పదును పెడుతున్నాయి.
హైదరాబాద్ కూతవేటు దూరంలో క్రీస్తుపూర్వం వేయి సంవత్సరాల క్రితం నాటి ఆపూర్వరాతి చిత్రాలను తెలంగాణ చరిత్ర బృందం కనుగొని ఆవిష్కరించింది. మల్కాజిగిరి జిల్లా మండల కేంద్రంలోని మూడుచింతలపల్లి శివారులో బృహత్ శిలా యుగానికి చెందిన రాతి రేఖాచిత్రం చరిత్ర కారుల పరిశోధనల్లో బహిర్గతమైందని ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.
శామీర్ పేట, బొమ్మల రామారం దారిలోని మూడుచింతలపల్లి శివారులో రోడ్డుకు ఎడమవైపున వృత్తాకారపు రాతి రేఖాచిత్రం ఉందని రామోజు హరగోపాల్ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృదం సభ్యులు కొరవి గోపాల్, మహ్మద్ నజరుద్దీన్, అహోబిలం కరుణాకర్, అన్వర్ బాష ఇచ్చిన సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆదివారం రేఖాచిత్రాన్ని పరిశీలించి క్రీస్తు పూర్వంనాటి చిత్రంగా గుర్తించారు.
కొద్దిపాటి ఎత్తు గ్రానెట్ కొండపై 7.5 మీ. వ్యాసంతో 30 సెం.మీ. మందంతో చుట్టూ ఒక వలయంతో మధ్యలో రెండు త్రిభుజాకారాలతో ఉన్న వృత్తం ఆధునిక పరికరాలతో గీయించినంత కచ్చితంగా, అందంగా ఉందని తెలిపారు. ఈవృత్తానికి సమీపంలో కొత్త రాతి యుగంనాటి రాతి గొడ్డళ్లుగాట్లు కిలోమీటరు పరిధిలో శిలాయుగపు ఎద్దులు, దుప్పులు, మనుషుల వర్ణ చిత్రాలు ఉన్న కొండ చరియ, గుహ ఆవాసాలు ఉన్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.
మూడు చింతలపల్లి వృత్తాకారపు రాతి రేఖా చిత్రాన్ని పరిశీలించిన శిలాయుగపు పురావస్తు చిత్రకళా పరిశోధకుడు ఆచార్య రవి కొరిశెట్టార్ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం నాటిదని స్పష్టత ఇచ్చారు. ఆకాలపు ప్రజలు గుండ్రంగా నిర్మించుకునే సమాధులకు ఇది ఒక నమూనానని తెలిపారు. హైదరాబాద్ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో రాతికొండపై ఉన్న ప్రాచీన మానవుని ఉనికిని తెలిపే ఆనవాళ్ల ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.