Sunday, November 24, 2024

Delhi | జులై 7లోగా టీపీసీసీ కొత్త అధ్యక్షుడు… అధిష్టానం చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: జులై7 లోగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. పీసీసీ రథసారధిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తన పదవీకాలం జులై7తో ముగుస్తుందని వెల్లడించారు. ఈలోగా కొత్త అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాల్సిందిగా అధిష్టానం పెద్దలకు చెప్పినట్టుగా వెల్లడించారు. గురువారం ఢిల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను 2021 జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని, పీసీసీ అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు ఉంటుందని రేవంత్‌ అన్నారు. ఈ మూడేళ్లలో పార్టీకి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విజయాన్ని అందించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ గణనీయమైన సంఖ్యలో సీట్లను అందించానని చెప్పారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని, అందులో తన ప్రమేయమేమీ లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు.

అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా.. సమన్వయంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే, పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు ఢిల్లిలో అధిష్టానం పెద్దలతో పాటు రేవంత్‌ రెడ్డి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి వర్గానికి చెందిన నేత ఉన్నందున ఈసారి పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వర్గాలకు చెందిన నేతకు ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. బీసీ వర్గం నుంచి మహెశ్‌ కుమార్‌ గౌడ్‌, మధుయాష్కి గౌడ్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

ఆ ఇద్దరు నేతలు గురువారం ఢిల్లిలో సోనియా గాంధీ సహా అధిష్టానం పెద్దలను కలవడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్టయింది. వీరితో పాటు మరికొందరు బీసీ నేతలు పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎస్సీల్లో మాదిగవర్గానికి ఇంత వరకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కలేదని ఆ వర్గం నేతలు చెబుతున్నారు.

ఈ మధ్యనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ మాదిగ వర్గం నేతలకు టికెట్లు ఇవ్వకపోవడాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాదిగ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన సంపత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించాలని కొందరు నేతలు కోరుతున్నారు. సంపత్‌ గురువారం మధ్యాహ్నం ఢిల్లిలో సీఎం రేవంత్‌ను కలిశారు. మొత్తంగా పీసీసీ అధ్యక్ష రేసులో పలువురు నేతలు పోటీ పడుతున్నారు.

- Advertisement -

పీసీసీ అధ్యక్ష ఎంపిక కసరత్తులో భాగంగా గురువారం రాత్రి రాష్ట్ర ముఖ్యనేతలతో అధిష్టానం పెద్దలు సమావేశమయ్యారు. గురువారం సాయంత్రానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లి చేరుకున్నారు. నాలుగు రోజులుగా ఢిల్లిలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌ మున్షి ఈ అంశంపై ప్రాథమిక కసరత్తు పూర్తిచేసినట్టు తెలిసింది. డిప్యూటీ సీఎంతో కలిసి ముగ్గురు నేతలు కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. రేవంత్‌, భట్టి ఇద్దరు నేతలకు ఆమోదయోగ్యంగా ఉండే నేతవైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement