హైదరాబాద్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశానికి మరో 24 గంటలే మిగిలింది. సెప్టెంబర్ 7న ప్రారంభించిన పాదయాత్ర కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతం చేసుకుని.. ఆదివారం ఉదయం 6గంటల సమయంలో నారాయణపేట్ జిల్లా మక్తల్ అసెంబ్లి నియోజక వర్గంలోకి కృష్ణానదీ మీదుగా గుడవల్లూరుకు చేరుకుంటుంది. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రాహుల్ యాత్రను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అప్పగించనున్నారు. రాహుల్ యాత్రకు దాదాపు 60 వేల మందితో స్వగతం పలికేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సన్నహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన స్థలంలోనే పార్టీ జెండాను రాహుల్‌గాంధీ ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందుకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, రాహుల్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో 375 కిలోమీటర్ల మేర సాగనుంది. 16 రోజులు రాష్ట్రంలో ఉండగా, అందులో 4 రోజులు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అంటే 12 రోజుల పాటు పాదయాత్ర జరగనుంది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు రాజస్థాన్ సీఎం అశోక్ గేహ్లాట్, చత్తీష్‌ఘడ్ సీఎం భూపేష్‌బాగేలాతో పాటు మరికొందరు సీనియర్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఏ నాయకుడు ఎక్కడ హాజరుకావాలనే షెడ్యూల్ ఇంకా ఫైనల్ కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 1న రాహుల్ యాత్ర హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అదే రోజు అరంఘార్ మీదుగా పాతబస్తీ, చార్మినార్, గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇంధీరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. నెక్లెస్ రోడ్డు వద్దే కార్నర్ మీటింగ్ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలో మత కలహాలు జరిగినప్పుడు రాజీవ్‌గాంధీ చార్మినార్ నుంచే సద్భావన యాత్ర ప్రారంభించి దేశ వ్యాప్తంగా పర్యటించిన విషయాన్న కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. రాహుల్‌యాత్ర పాతబస్తీ నుంచి రావడంతో ముస్లిం వర్గాల్లో పార్టీకి పట్టు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాహుల్‌యాత్ర హైదరాబాద్‌లో ఉన్నప్పుడే సోనియాగాంధీ హాజరైతే.. పార్టీకి మంచి మైలేజ్ వస్తుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలున్నారు.
సోనియాగాంధీ హాజరైతే .. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడతున్నారు. కర్ణాటకలో రాహుల్ యాత్రకు సంఘీభావంగా సోనియాగాంధీ హాజరై సంఘీభావం తెలపడంతో కర్ణాటకలో పార్టీకి మంచి ఊపు వచ్చిందని గుర్తు చేస్తున్నారు. సోనియాగాంధీ కాలు ష్యూ లేస్ తెగిపోతే.. రాహుల్‌గాంధీనే స్వయంగా కట్టిన ఫోటో వైరల్ కావడం కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక పోతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీష్‌ఘడ్ సీఎం భూపేష్ బాగల్ కూడా వేర్వేరు సమయాలో రాష్ట్రానికి వచ్చి రాహుల్ యాత్రకు సంఘీభావం తెలుపుతారని చెబుతున్నారు. ఇప్పటికే రాహుల్ యాత్రలో కేంద్ర మాజీ మంత్రులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్యం ఠాగూర్, తదితరులు కీలకంగా వ్యవహారిస్తున్నారు. పాదయాత్ర సాగే రాష్ట్రాల నేతలతో సమన్వయం చేస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాదయాత్ర రూట్‌లోని ప్రాంతాలను ముందుగానే తిరిగి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.