తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీని పతనం చేసే దిశగా వచ్చే వారందరినీ కలుపుకునే ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను రేవంత్ కలిశారు. దీంతో దేవేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా అన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
టీఆర్‌ఎస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి దేవేందర్ గౌడ్ అని, ఆయన కుమారుడు వీరేందర్ తనకు మంచి మిత్రుడు అని రేవంత్ తెలిపారు. తెలంగాణలో కారు దారి తప్పిందని, దేవేందర్ గౌడ్ పాదయాత్రతోనే అనాడు కాంగ్రెస్ జలయజ్ఞం జరిగిందన్నారు. తొండలు గుడ్లు పెట్టని రంగారెడ్డి, హైదరాబాద్‌లో భూముల ధరలు పెరిగాయి అంటే కారణం దేవేందర్ గౌడ్ అని రేవంత్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల లాంటి సంక్షేమం పేదలకు దూరం అయ్యిందని మండిపడ్డారు. అందరం కలిసి తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ కోసం పని చేస్తామని, కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తామన్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడ వదిలిస్తామని రేవంత్ హెచ్చరించారు.