టీ పీసీసీ చీఫ్గా బుధవారం నాడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలిసి పోరాడి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కొందరి చేతుల్లో బంధీగా మారిందన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందిన నలుగురు చేతుల్లో చిక్కుకుందన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పేద ప్రజలు బతికి బట్టకట్టే పరిస్థితి లేకుండా పోయిందని.. ఈ ప్రభుత్వాలను వంద మీటర్ల గోతిలో పాతిపెట్టాలన్నారు. రెండేళ్లు కాంగ్రెస్ కార్యకర్తలు నిద్రపోకుండా కష్టపడితే.. అధికారం తప్పకుండా వస్తుందన్నారు.
యువతకు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల హామీ ఏమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వయంపాలన లేక పెద్దదిక్కు లేకుండా పోయిందన్న ఆయన.. తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి ఇష్టారీతిన ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. రాహుల్ గాంధీ వంటి నాయకుడు మన సైన్యాన్ని నడిపిస్తున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే పీకేలు (ప్రశాంత్ కిశోర్), ఏకే-47లు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ వద్ద ఉన్న తూటాలు మీరే అని కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచారు. కార్యకర్తలే పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం సర్వస్వం ఒడ్డి తెలంగాణ ఇస్తే, కృతజ్ఞత తెలపాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
కాగా రేవంత్ తన ప్రసంగం కొనసాగిస్తుండగా, పలువురు అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై సీరియస్ అయిన రేవంత్.. వ్యక్తిగత నినాదాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండరని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ సమిష్టి పోరాటాలతో అధికారం చేజిక్కించుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: రేవంత్ ఇప్పుడే సీఎం అయిపోయారా?