టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని, కేటీఆర్ దగ్గర వారికి కూడా డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు వచ్చాయని రేవంత్ ఆరోపించారు. అందుకే ప్రభుత్వ పెద్దలు డ్రగ్స్ కేసుపై భయపడుతున్నారని రేవంత్ అన్నారు. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు డ్రగ్స్ కేసులో కేటీఆర్ పాత్ర ఉందా.. ? రకుల్ పాత్ర ఉందా? అనేది అసలు సమస్యే కాదని రేవంత్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌కు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర వారా అన్న విషయంతో తనకు సంబంధం లేదని రేవంత్ తెలిపారు. డ్రగ్స్ కేసుపై ఈడీ త్వరితగతిన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గోవాకు కేటీఆర్ ఎందుకు వెళ్లారో దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయాలన్నారు. డ్రగ్స్ అనేది మన దేశానికి కొత్తేమీ కాదని… ఇతర దేశాల్లో మాదక ద్రవ్యం మన దేశానికి వస్తుందన్నారు. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ అధికారులకు విచారణ అధికారం ఉండదన్నారు. ఇతర దేశాలకు వెళ్లి విచారణ చేయలేరన్నారు. కోర్టుల్లో సర్కారు తామే విచారణ చేశామని… ఎవరికీ వివరాలు ఇవ్వం అంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కేసు నమోదు చేసిందని రేవంత్ వివరించారు.
మరోవైపు తనకు సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డిపైనా రేవంత్ మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని ఆధారాలు తాను ఇస్తున్నానని తెలిపారు. 50 ఎకరాలలో లేఅవుట్ వేస్తే.. మామూళ్లు ఇవ్వాలని బహిరంగంగా ఆయన వసూలు చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ అక్రమాలపై ఎందుకు విచారణ చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని.. గుండ్లపోచంపల్లిలో సర్వేనెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉందన్నారు. అయితే ఈ భూమి ఒక్కసారిగా ధరణి పోర్టల్‌కు వచ్చేసరికి 33 ఎకరాల 26 గుంటలుగా మారిందన్నారు. న్యాక్ గ్రేడింగ్ కోసం పెట్టిన పత్రాలన్ని పోర్జరీ పత్రాలని .. న్యాక్ నిషేధించిందని తెలిపారు. ఫోరెన్సిక్ ధ్రువపత్రాలన్నీ తప్పుడివేనని.. వీటిని 5 ఏళ్లు న్యాక్ నిషేధించిందన్నారు. 420 కింద జైల్లో వేయాల్సిన మల్లారెడ్డిని మంత్రిని చేసిన ఘనత కేసీఆర్‌దే అని రేవంత్ ఎద్దేవా చేశారు.
అటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విజిలెన్స్ విచారణలో వందల కోట్లు దోపిడీ చేసిందని వెల్లడైందన్నారు. పచ్చిదొంగ లంగా గాళ్లను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. దత్తత పేరుతో గ్రామాలను తీసుకొని.. ఫాంహౌస్‌కు రోడ్డు వేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తే.. ప్రతిపక్షం తరపున ప్రశ్నించే హక్కు లేదా అని నిలదీశారు. మూడు గ్రామాల్లో ఇచ్చిన హామీలను సీఎం హోదాలో కూడా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చి కుక్కలుగా, ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తిట్ల పోటీ పెట్టుకుందామంటే తాము రెడీగా ఉన్నామన్నారు. ప్రగతి భవన్‌కు లేదా ఫాంహౌస్‌కు రమ్మనా వస్తానన్నారు. మల్లారెడ్డి అవినీతిని కేటీఆర్, కేసీఆర్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. 2019లో తాను గెలించిందే మల్లారెడ్డి మీద అని కేటీఆర్ గుర్తించాలన్నారు. తాను సవాల్ చేస్తున్నా అని.. ప్రభుత్వాన్ని రద్దు చేసి రావాలని.. అంత ధైర్యం లేకపోతే.. కేసీఆర్ గజ్వేల్‌లో రాజీనామా చేస్తే తాము తేల్చుకుంటామన్నారు. మధ్యలో చెంచాలతో తొడగొట్టడాలు ఎందుకన్నారు. ముందస్తు ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ బలం ఏంటో చూపిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.