ప్రతిరోజూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలపై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు ‘చలో రాజ్‌భవన్’కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసుల చర్చలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తామని, ధర్నాచౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు ప్రదర్శనకు అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
అరెస్టు చేసిన వారిని పోలీసులు వెంటనే విడిచిపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శాంతియుత నిరసనలను ఇలా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చిఆందోళన నిర్వహిస్తారని హెచ్చరించారు. ఎంత మందిని అరెస్టు చేయించినా తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని రేవంత్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ పన్నులను పెంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేందుకు తాము వెనకాడబోమని పేర్కొన్నారు.
ఈ వార్త కూడా చదవండి: కాంగ్రెస్ నేతల ఛలో రాజ్‌భవన్‌లో టెన్షన్.. అడ్డుకుంటున్న పోలీసులు