ఈనెల 27 నుంచి భారత్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను పున:ప్రారంభించ నున్నాయి. ఈక్రమంలో కేంద్ర ఈవీసా విధానాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది. 156 దేశాల పౌరులకు ఈ-టూరీస్ట్ వీసాలను కేంద్రం పునరుద్ధరించింది. కరోనా మహమ్మారి దెబ్బకు రెండేళ్లుగా కుదేలైన విమానయాన రంగాన్ని మళ్లి గాడిలోకి తెచ్చే దిశగా ఈనెల 27 నుంచి భారత్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను పున:ప్రారంభించనుంది. 156 దేశాల పౌరులకు ప్రస్తుతం చెల్లుబాటయ్యే ఐదేళ్ల ఈ-టూరిస్ట్ వీసాలు తక్షణమే అమల్లోకి వచ్చేలా భారత్ పునరుద్ధరణ నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా నేపథ్యంలో భారత్ దాదాపు అన్ని దేశాల పౌరులకు ఈ-టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేయడం తెలిసిందే. మళ్లి రెండేళ్లకు కరోనా తీవ్రత తగ్గిన దరిమిలా ఆయా దేశాల పౌరులకు వాటిని పునరుద్ధరించింది.
మిగతా అన్ని దేశాలకూ ఈ-టూరిస్ట్ వీసా కాలపరిమితి ఐదు ఏళ్లుకాగా, అమెరికా, జపాన్ జాతీయులకు మాత్రం వీసా గడువు పాత పద్ధతిలోనే 10ఏళ్లు ఉటుంది. 2020 మార్చి నుంచి సస్పెన్షన్‌లో ఉంచిన, ప్రస్తుతం చెల్లుబాటయ్యే వీసాను 156 దేశాల పౌరులకు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విదేశాంగ శాఖ ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. వీసా మాన్యువల్ 2019 ప్రకారం ఈ 156 దేశాల జాతీయులు కూడా తాజా ఈ-టూరిస్ట్ వీసా జారీకి అర్హులు. ఐదు సంవత్సరాల చెల్లుబాటుతో ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే రెగ్యులర్ (పేపర్) టూరిస్ట్ వీసా పునరుద్ధరిస్తారు. కాలానుగుణంగా విధించిన పరిమితులకు లోబడి అర్హతగల దేశాల జాతీయులకు ఐదేళ్ల వరకు తాజా రెగ్యులర్ (పేపర్) టూరిస్ట్ వీసా కూడా జారీ చేయనున్నట్లు ఉన్నత అధికారి తెలిపారు. కరోనా కాలంలో భారత్ 30కిపైగా దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పందాలు చేసుకొని అత్యవసర సర్వీసులను నడిపింది. కాగా విమానాల్లో ఎయిర్ బబుల్ పద్ధతి కూడా ఈనెల 27 నుంచి రద్దుకానుంది.