Tuesday, November 26, 2024

భక్తుల సౌకర్యార్థమే టూరిస్ట్ పోలీస్ స్టేషన్ : ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

కర్నూలు జిల్లా : మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ప్రాంగణం మధ్వ కారిడార్ ప్రత్యేక భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిస్టు పోలీస్ స్టేషన్ మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సులో వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 21 పర్యాటక ప్రాంతాలలో టూరిస్టు పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేశారని, ముఖ్యమంత్రిచే వర్చువల్ విధానంలో ఆవిష్కరణ జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ మఠంలోని టూరిస్టు పోలీసుస్టేషన్ ను ఆవిష్కరణ చేసి ప్రారంభించామన్నారు. ఈ టూరిస్టు పోలీసుస్టేషన్ లో ఒక ఎస్సై ఆధ్వర్యంలో 7 మంది పోలీసులు రోటేషన్ పద్దతిలో విధులు నిర్వహిస్తుంటారన్నారు. భద్రత పరంగా సేవలు అందిస్తారన్నారు. ఏదైనా ఆపద, ప్రమాదం జరిగిన సమయాలలో తదితర విషయాలలో అప్రమత్తంగా వ్యవహారిస్తారన్నారు. భద్రతే ప్రధానంగా సేవలందిస్తామన్నారు. వచ్చే పర్యాటకుల భద్రత, సేవా భావంపై దృష్టి సారిస్తామన్నారు. భక్తులకు సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. భక్తుల సౌకార్యర్థం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. మంత్రాలయంకు రాఘవేంద్ర స్వామి దర్శనార్ధం సామాన్య భక్తులే కాకుండా ప్రజా ప్రతినిధులు, విఐపిలు అత్యధిక సంఖ్యలో వస్తుండడంలో అత్యధిక భద్రత కల్పిస్తామన్నారు. రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తు లకు పోలీసు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

పర్యాటకులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా ఇకపై ఈ టూరిస్ట్ పోలీసింగ్ విధానం సమర్ధవంతంగా అమలు కానుందన్నారు. సమాచారాన్ని బ్రోచర్ల రూపంలో అందుబాటులో ఉంచారన్నారు. పోలీస్ శాఖకు శ్రీ మఠం ఎప్పుడు అండగా ఉంటుందని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తో పాటు శ్రీమఠం పీఠాధిపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ… పోలీసు శాఖకు అన్ని సహాయ సహకారాలు శ్రీ మఠం తరఫున అందిస్తామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ కు కావలసిన గదులు, ఫర్నిచర్ ఇతర ఇతర సామాగ్రి శ్రీమఠం అందిస్తుందన్నారు. దేశంలోని మంత్రాలయం శ్రీ క్షేత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక కేంద్రాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. సెలవు రోజులలో ప్రత్యేక పర్వదినాలలో రోజుకు లక్ష మంది దాకా భక్తులు వస్తుంటారని పీఠాధిపతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి.ప్రసాద్, ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్, మంత్రాలయం సీఐ శ్రీనివాసులు, కమ్యూనికేషన్ సీఐ మనోహర్, మంత్రాలయం ఎస్సై వేణుగోపాల్ రాజు, మాధవరం ఎస్సై కిరణ్ బాబు, టెంపుల్ మేనేజర్ శ్రీనివాస రావు, ఏవోవో మాధవశెట్టి , పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement