- జిల్లాలో అద్భుత పర్యాటక ప్రదేశాలు
- కనువిందు చేస్తున్న పోచారం అభయారణ్యం
- ప్రకృతి సోయగాలకు నిలయం
- ఆహ్లాదపరుస్తున్న నర్సాపూర్ అర్బన్ పార్కు
- మంజీర, సింగూరు ప్రాజెక్టుల పరవళ్లు
- అందాలకు నెలవు అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులు
- ఆధ్యాత్మిక చిహ్నాలు ఏడుపాయల
- వనదుర్గా, కొమురవెల్లి మల్లన్న ఆలయాలు
- మెదక్‌లో ఆసియాలోనే రెండో అది పెద్ద చర్చి
- రోజురోజుకు పెరుగుతున్న పర్యాటకుల సందడి
- ఓ వైపు ఆధ్యాత్మికం.. మరో వైపు ఉత్సాహం
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రకృతి అందాలు భూలోక స్వర్గాన్ని తలపిస్తున్నది. ఎన్నెన్నో హొయలతో ప్రకృతి ఆహ్వానం పలుకుతున్నది. పోచారం అభయారణ్యం.. నర్సాపూర్ ఫారెస్ట్.. ఏడుపాయల వనదుర్గమ్మ.. కొమురవెల్లి మల్లన్న.. వర్గల్ సరస్వతీ మాత.. మెదక్ చర్చి.. కోమటి చెరువు.. తేజోవనం, గజ్వేల్ అర్బన్ పార్కు.. అన్నపూర్ణ.. రంగనాయకసాగర్.. మల్లన్నసాగర్.. కొండపోచమ్మసాగర్.. మంజీర.. సింగూరు ప్రాజెక్టులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పచ్చని చెట్లు.. ఎటు చూసినా చల్లని వాతావరణం, దట్టమైన అడవులు.. వన్యప్రాణుల సందడి.. పులుల సంచారం.. లాంటి దృశ్యాలు ప్రకృతి రమణీయతకు అద్దంపడుతున్నాయి. అందమైన సరస్సులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.
– ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ బ్యూరో
మెతుకు సీమ పర్యాటకంగా విరాజిల్లుతోంది. మెదక్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం అభయారణ్యం వన్యప్రాణులు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మెదక్ జిల్లాలో ప్రధాన పర్యాటక స్థలంగా పేరొందింది. పచ్చని చెట్లు- ఎటు- చూసినా చల్లని వాతావరణం, వన్యప్రాణుల కేరింతలు, దట్టమైన అడవులు.. పులుల సంచారంతో మెదక్ సమీపంలో ఉన్న పోచారం అభయారణ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నది. మెదక్ జిల్లాకు 15 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారం అభయారణ్యంలో అందమైన సరస్సుతో పాటు అపారమైన జంతు, వృక్ష జాతులు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండో చర్చిగా ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, ఆధ్యాత్మికతకు నిలయమైన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం, మంజీర సోయగాలు ఇవన్నీ మెదక్ జిల్లాలో కనిపిస్తాయి. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న, వర్గల్ సరస్వతీమాత ఆలయం, కోమటి చెరువు, తేజోవనం, గజ్వేల్ అర్బన్ పార్కుతో పాటు అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, సంగారెడ్డి జిల్లాలో సింగూరు, పోచారం అభయారణ్యం, కేతకీ సంగమేశ్వరాలయంతో పాటు- ఇతర ప్రాజెక్టులు అందాలకు నెలవుగా ఉన్నాయి.
పెరుగుతున్న పర్యాటకుల సందడి..
ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యాటకు సందడి రోజురోజుకు పెరుగుతుంది. సీటీ జనం మహానగరానికి ఆనుకుని ఉన్న సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలో టూర్‌ల బాటపడుతున్నారు. వీకెండ్‌ను జాలీగా గడిపేందుకు తహతహ లాడుతున్నారు. సండేను ఎంజాయ్ డేగా మల్చుకునేందుకు హైదరాబాద్ ఆనుకుని ఉన్న ఉమ్మడి మెదక్‌లోని పర్యాటక, ప్రసిద్ధ దేవాలయాల సందర్శిస్తుంటారు. ఎక్కువగా యూత్ బైక్‌లపై దోస్తాన్‌తో ఆయా దేవాలయాల దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో జాళిగా గడిపేస్తున్నారు. ఇక కార్లు ఉన్న ఫ్యామిలీలు ఎంచక్కా ఉదయమే బయలుదేరి ఆయా దేవస్థానాల దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో వంటా,వార్పుతో నేచర్ ఎంజాయ్ చేస్తూ మస్తు కుషీ చేసుకుంటున్నారు. మొత్తానికి సండే వచ్చిందంటే చాలు సందడి చేసేస్తున్నారు.
వన దుర్గాదేవి – మల్లన్న దర్శనాలు ఫుల్
ఎక్కువ శాతం ఫ్యామిలీలు మెదక్‌లోని ఏడుపాయలలో కొలువైన వనదుర్గాదేవి ఆలయానికి, ఇటు సిద్ధిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లన దర్శనానికి క్యూ కడుతుస్నారు. మెదక్ ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయానికి సండే వచ్చిందంటే భక్తుల తాకిడి ఎక్కువవుతుంది. ఏడుపాయల వెళ్లే మార్గ మధ్యలో నర్సాపూర్ అటవీ ప్రాంతంలో మూగజీవాలకు ఫీడ్ చేస్తూ వెళ్తున్నారు. నర్సాపూర్ అటవి ప్రాంతంలో కోతులు ఎక్కువగా ఉండటం, రోడ్డు వెంట వెళ్తున్నవారు ఫీడ్ చేస్తారేమోనని అవి ఆశగా ఎదురుచూస్తుండటంతో ఎక్కువ శాతం మంది నర్సాపూర్ అటవీ ప్రాంతంలో కొద్ది సేపు తమ వాహనాలను ఆపి అక్కడ దొరికే పండ్లు, ఫలాలను కోతులకు అందిస్తూ గ్రీన్ నేచర్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇక ఏడుపాయల వన దుర్గాదేవి దర్శనం అనంతరం పరిసర ప్రాంతాల్లో వంటావార్పు చేసుకుని ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు.
ఇక సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన దేవస్థానం ఎంతో ప్రసిద్ధి పొందిన దేవాలయం. కోరిన కోర్కెలు తీర్చే మల్లన్నగా ప్రజలచే కొలువబడుతున్నాడు. కొమురవెల్లి దర్శనం అనంతరం కొండపోచమ్మ దేవాలయంల వద్ద కుటుంబ సమేతంగా భక్తులు మొక్కులు చెల్లించుకుని కోళ్లు-గొర్లు కోసుకుని వంటావార్పు చేసుకుని విందు ఆరగించి సాయంత్రం పూట సిటీకి తిరుగుప్రయాణం అవుతున్నారు. ఇలా ప్రతి సండే భక్తులతో ఏడుపాయలతో పాటు కొమురవెళ్లి మల్లన దేవాలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి.
కొంగొత్త అందాల కోమటి చెరువు..
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువును సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీష్ రావు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. చెరువు వద్ద ఏర్పాటు- చేసిన వేలాడే వంతెన, పార్కు, బోటింగ్, నెక్లెస్ రోడ్డు, రాత్రిపూట అందాలు విరజిమ్ముతున్న లైటింగ్ పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తున్నది. చిల్డ్రన్ పార్కుతో పాటు- పచ్చదనం పర్చుకోవడంతో ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని పట్టణ ప్రజలకు అందిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట పక్కనే రంగనాయకసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మంది పర్యాటకులు నిత్యం వస్తున్నారు. చుట్టూ నీరుండి మధ్యంలో ద్వీపంలా ఉండడంతో పర్యాటకులను రంగనాయకసాగర్ విశేషంగా ఆకర్శిస్తున్నది.