Tuesday, November 26, 2024

ఆర్టీసీలో పర్యాటక విభాగం.. సమీప ప్రాంతాలకు ప్రత్యేక బస్సులకు విశేష ఆదరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పర్యాటక, చారిత్రక, పుణ్య క్షేత్రాలు ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్‌ ఆర్టీసీ పూర్తి స్థాయిలో పర్యాటక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలలో భాగంగా కొత్త పథకాలను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ అధికారులు పర్యాటకులను ఆకర్శించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే టూరిజం విభాగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ తన ప్రణాళికను పర్యాటక శాఖ ముందు ఉంచింది.ఆ శాఖ అధికారుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా త్వరలో సంయుక్త విధానాన్ని రూపొందించనుంది.

ప్రస్తుతం పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని పలు పర్యాటక,చారిత్రక ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నది. అయితే, సంస్థ పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నిర్వహించే స్థితిలో లేని కారణంగా ఆర్టీసీ ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ శివారులోని అనంతగిరి, వికారాబాద్‌ వంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రతీ ఆదివారం ఉదయం బస్సు నడిపింది. పర్యాటకుల కోసం నడిపిన బస్సులకు విశేష స్పందన లభించింది. దీంతో రాష్ట్ర్రవ్యాప్తంగా ముఖ్యమైన చారిత్రక, పర్యాటక, పుణ్య క్షేత్రాలు ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడికి బస్సులను నడపాలని నిర్ణయించింది.

- Advertisement -

ఇందుకు గాను పూర్తి స్థాయిలో పర్యాటక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కోవిడ్‌ సమయంలో రాష్ట్ర్రంలో పూర్తిగా దెబ్బతిన్న పర్యాటక రంగం దాదాపు మూడేళ్ల తరువాత పుంజుకుంది. ముఖ్యంగా ప్రస్తుత వేసవి కాలంలో విద్యా సంస్థలకు సెలవుల దృష్ట్యా పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతారని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మరింత ఆదాయం పొందాలన్న లక్ష్యంతో దాదాపు 50 బస్సులను పూర్తిగా పర్యాటక ప్రాంతాలకే కేటాయించింది.

ఇప్పటికే నడిపిస్తున్న సమీప ప్రాంతాలతో పాటు తిరుపతి, సింగరేణి దర్శన్‌, కొండపోచమ్మ సాగర్‌, రంగనాయక సాగర్‌ వంటి పర్యాటక ప్రాంతాలకు ఈ బస్సులను ప్రారంభించింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర్రవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులలో వెళ్లే ప్రయాణికులకు వీటిని వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ మేరకు త్వరలో ఆర్టీసీ, పర్యాటక శాఖ ఉన్నతాధికారుల సమావేశం అతి త్వరలో జరుగనుందనీ, ఈ సమావేశంలో రెండు సంస్థలు కలిపి సంయుక్తంగా పర్యాటకులకు ఏ విధమైన సేవలు అందించాలి ? ఏ మేర ఆదాయం సమకూర్చుకోవాలని అనే అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ సహకారంతో పర్యాటక రంగం కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ఆ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement