Friday, November 22, 2024

ఫార్మా రంగానికి గడ్డుకాలం.. రానున్న రోజుల్లో తగ్గనున్న పెట్టుబడులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత రెండేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన ఫార్మా రంగానికి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఈ రంగంలో రాష్ట్రంలోకి కొత్తగా వచ్చే పెట్టుబడులు కూడా తగ్గవచ్చని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొవిడ్‌ తర్వాత ఒక్కసారిగా పెరిగిన ఔషధాల అమ్మకాలతో ఫార్మా రంగంలో బూమ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బల్క్‌ డ్రగ్స్‌, ఫార్ములేషన్స్‌ తయారీకి సంబంధించి రాష్ట్రానికి గడిచిన రెండేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లైఫ్‌సైన్సెస్‌ రంగంలోనూ రాష్ట్రానికి జోరుగా పెట్టుబడులు రావడంతో కొత్తగా వేల మంది ఫార్మారంగ నిపుణులకు హైదరాబాద్‌లో ఉద్యోగాల కల్పన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

కొవిడ్‌ బూమ్‌ నుంచి సాధారణ స్థితికి ఔషధాల అమ్మకాలు కొవిడ్‌ కారణంగా గడిచిన రెండేళ్లలో వివిధ రకాల మందుల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయి ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత మందుల అమ్మకాలు కొవిడ్‌కు ముందు స్థితికి వచ్చినట్లు పలు వాణిజ్య కన్సల్టెన్సీ కంపెనీల నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఫార్మా కంపెనీలు ఇప్పటికే విస్తరించుకున్న తయారీ సామర్థ్యాలు మరికొన్నేళ్ల పాటు విక్రయాలకు తగ్గట్లు సరఫరా చేయడానికి సరిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఫార్మా రంగంలో కొత్త పెట్టుబడుల జోరు గతంలో ఉన్నంతగా రానున్న రెండు నుంచి మూడేళ్లలలో ఉండకపోవచ్చని వారు విశ్లేషిస్తున్నారు.

అమెరికా మార్కెట్‌ స్థిరీకరణతో తగ్గనున్న ఎగుమతులు

హైదరాబాద్‌ నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీల నుంచి వివిధ రకాల ఫార్మా ఉత్పత్తులు చాలా వరకు అమెరికాకు ఎగుమతవుతూ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో అమెరికాలో ఫార్మాసుటికల్‌ మార్కెట్‌ స్థిరీకరణకు గురైనట్లు పెద్దగా వృద్ధి సాధించలేకపోయినట్లు ఫార్మా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎగుమతుల వ్యాపారం కూడా భవిష్యత్తులో కంపెనీలకు పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్‌ లక్ష్యంగా యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి తీసుకుని కంపెనీలు పెట్టే కొత్త పెట్టుబడులు చాలా వరకు తగ్గవచ్చని ఫార్మా రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement