సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనుకున్న టీమిండియా 31 ఏళ్ల కల ఈసారి కూడా నెరవేరలేక పోయింది. మొదటి టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కనీస పోటీ ఇవ్వకుండానే మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించుకొని ఇన్నింగ్స్ 32 పరుగులతో చిత్తయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్ రెండో టెస్టులోనైన గెలిచి పరువుతో పాటు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోవాలని భావిస్తోంది. కేప్‌టౌన్ వేదికగా నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరిదైన రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌లో ఎలాగైన నెగ్గి సిరీస్ చేజారకుండా కాపాడుకోవాలని రోహిత్ సేన కసరత్తులు మొదలు పెట్టింది. ఇక్కడి పిచ్ కూడా బౌన్స్‌లకు సహకరిస్తుందని తెలిసింది. అందుకే భారత బ్యాటర్లకు ఈ మ్యాచ్ కఠిన పరీక్షగా మారింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైన భారత్.. ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మంచి హోమ్‌వర్క్‌తో కేప్‌టౌన్ టెస్టు కోసం సిద్ధమైంది. మంచి ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని కెప్టెన్ రోహిత్ పేర్కొన్నాడు.
గత టెస్టులో టీమిండియా బ్యాటింగ్ పేలవంగా ఉంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరే రాణించినా మిగతా బ్యాటర్లంతా తేలిపోయారు. కానీ ఈసారి ఆ తప్పులను పునరావుతం కాకుండా జాగ్రత్తగా ఆడాలని టీమిండియా బ్యాటర్లు నిర్ణయించుకున్నారు. ఈ మ్యాచ్ భారత సారథి రోహిత్ శర్మకు అగ్ని పరీక్షగా మారింది. అతనిపై ఈసారి అధిక ఒత్తిడి ఉండటం ఖాయం. అయినా ఆ ఒత్తిడిని జయించి జట్టును విజయపతంలో నడిపించే బాధ్యత అంతా సారథి రోహిత్‌పైనే ఉంది. ఓపెనర్‌గా బరిలో దిగే రోహిత్ ఈసారి భారీ స్కోర్లతో టీమిండియాను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పెట్టించడం ఖాయం.
ఇక ఈసారి శర్మపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు వరుసగా విఫలమవుతున్న యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌కి ఇది చివరి అవకాశం. ఈ మ్యాచ్‌లో తన సత్తేంటో నిరూపించుకోవాల్సి ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో క్రీజులోకి దిగే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌పై అంచనాలు మరింతా పెరిగాయి. ఈసారి కూడా వీరు రాణిస్తే టీమిండియా భారీ పరుగులు సాధించడం సాధ్యమే. మరోవైపు తర్వాతి బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగా ఆడి జట్టుకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తొలి టెస్టులో గాయంతో దూరమైన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లి జట్టులోకి రావడం టీమిండియాకు శుభసూచికం. అతనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
బౌలింగ్‌లో మార్పులకు అవకాశం..!
ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత మ్యాచ్‌లో తేలిపోయిన యువ పేసర్ ప్రసిధ్ క్రిష్ణపై ఈ మ్యాచ్‌లో వేటుపడే అవకాశం ఉంది. అతని స్థానంలో ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. ఇక రవీంద్ర జడేజా కోలుకోవడంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడని తెలిసింది. గత మ్యాచ్‌లో బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటుకోగా.. సిరాజ్ రెండు వికెట్లతో అతనికి తోడుగా నిలిచాడు. ఈసారి అందరూ కలిసికట్టుగా రాణిస్తే సఫారీ బ్యాటర్లను కట్టడి చేయడం సులభమే. మొత్తంగా రోహిత్ సేన విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా..
తొలి టెస్టులో భారీ విజయాన్ని దక్కించుకున్న దక్షిణాఫ్రికా ఈసారి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టనుంది. సఫారీ టీమ్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసింది. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. బౌలింగ్‌లో రబాడా, బర్గర్ విజృంభించగా.. బ్యాటింగ్‌లో డీన్ ఎల్గర్ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి కెరీర్ చివరి టెస్టు ఆడుతున్న ఎల్గర్‌కు గ్రాండ్ ఫేర్‌వెల్ ఇవ్వాలని సఫారీ టీమ్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టుకు ఎల్గర్ సారథ్యం వహించనున్నాడు.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకుర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ/ముకేష్ కుమార్.
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడన్ మార్క్‌రమ్, టోనీ డి జోర్జి, కీగన్ పీటర్సన్, జుబేర్ హంజా, డేవిడ్ బెడింగ్‌హమ్, కీల్ వెరియానె (వికెట్ కీపర్), మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్/లుంగి ఎంగిడీ, కగిసొ రబాడా, నాంద్రే బర్గర్.