Monday, November 18, 2024

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు – ప్రధాని మోడీ..

న్యూఢిల్లి పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియా పలు పటిష్ట చర్యలు తీసుకుందని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోడీ ఆదివారం న్యూఢిల్లి లోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సేవ్‌ సాయిల్‌ మూమెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవ్‌ సాయిల్‌ మూమెంట్‌ వ్యవస్థాపకుడు మరియు ఇషా పౌండేషన్‌ చైర్మన్‌ సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, భూసారాన్ని పెంపొందింప చేయడానికి, మట్టి ఆరోగ్యాన్ని రక్షించడానికి ఇండియా అంకితభావంతో పని చేస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపాలని ఐదు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసిందని, ప్రభుత్వం ఆశించిన పది శాతం ఫలితాలు, నిర్ధేశిత గడువు కంటే ముందే చేరుకోవడం జరిగిందని ప్రధాని వెల్లడించారు. ఇండియాలో జీవవైవిధ్యం పెంపొందించడానికి, వన్యప్రాణుల సంరక్షణకూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, దేశంలో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందని సేవ్‌ సాయిల్‌ మూమెంట్‌కు హాజరైన పలువురు పర్యావరణ మేధావులకు ప్రధాని వెల్లడించారు.

భారతదేశ రైతాంగానికి గతంలో మట్టి ఆరోగ్యంపై అవగాహన ఉండేది కాదని, కేంద్రం రైతులకు జారీ చేసిన సాయిల్‌ హెల్త్‌కార్డ్‌ తో వారిలో మార్పు కలిగిందని ప్రధాని వివరించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం గంగా రివర్‌ కారిడార్‌తో పాటు నేచురల్‌ ఫార్మింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ప్రధాని వెల్లడించారు. ఈ సదస్సులో ప్రధాని లైఫ్‌స్టయిల్‌ ఫర్‌ ది ఎన్విరాన్‌మెంట్‌ మూమెంట్‌ (ఎల్‌ఐఎఫ్‌ఈ)ను కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దీని ద్వారా ఇండియా అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణకు అకాడమిస్ట్‌ లు, యూనివర్శిటీలు, రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూషన్స్‌, ప్రముఖ పర్యావరణవేత్తల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. ప్రధాని నరేంద్రమోడీ గతేడాది గ్లాస్కో లో జరిగిన 26వ యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌ లో లైఫ్‌ను పరిచయం చేశారు. ఆ కార్యక్రమానికి బిల్‌ గేట్స్‌, పర్యావరణ ఆర్థికవేత్త లార్డ్‌ నికోలస్‌ స్టెర్న్‌, నడ్జ్‌ థియరీ రచయిత కాస్‌ సన్‌స్టెన్‌, వరల్డ్‌ రీసోర్స్‌ ఇన్సిస్టిట్యూట్‌ సీఈఓ మరియు ప్రెసిడెంట్‌ అనిరుద్ధ దాస్‌గుప్తా, యుఎన్‌ఈపీ గ్లోబల్‌ హెడ్‌ ఇంగర్‌ అండర్సన్‌, యుఎన్‌డిపీ గ్లోబల్‌ హెడ్‌ ఆకిం స్టీనెర్‌, వరల్డ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మాల్పాస్‌ తదితర్లు పాల్గొన్నారు. సేవ్‌ సాయిల్‌ మూమెంట్‌ను ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురుజగ్గీ వాసుదేవ్‌ ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement