న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో నిలదీస్తామని బీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ… బడ్జెట్‌లో చెప్పినదేదీ వాస్తవంగా కనిపించట్లేదని, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగానికి, వాస్తవ కేటాయింపులకు పొంతన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన ఒకటి కాదని, శిక్షణ ఇచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదని చెప్పుకొచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం రూ. 60 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. మహిళా సాధికారత అని గొప్పగా చెప్పినా కేవలం రూ. 20 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. పది లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే తెలంగాణకు విస్తార అవకాశాలున్న జౌళి రంగం గురించి ప్రస్తావన లేకపోవడం బాధాకరమని చెప్పారు. ఏ స్కీమ్‌లోనూ తెలంగాణ మాటే రాలేదన్న ఆయన, వడ్డీ లేని రుణాలు కొత్తేమీ కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైతు, పేదల, గ్రామీణ ప్రజల వ్యతిరేక బడ్జెట్ : ఎంపీ నామా నాగేశ్వరరావు
డిజిటల్ వ్యవసాయం అంటే అభివృద్ధి జరిగిపోదని ఎంపీ నామా నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లలో ఎన్ని డ్యాములు కట్టారు? ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తెచ్చారు? ఎంత మందికి ఉచిత విద్యుత్ ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాగులు, సజ్జలు, కొర్రలు కొత్తగా ఇప్పుడే పండించినట్టు మాట్లాడుతున్నారని, మిల్లెట్స్ పేరుతో మాయమాటలు, మోసపు విధానాలను అమలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కేవలం కర్ణాటకలో మాత్రమే కరవు ఉందన్నట్టుగా స్కీమ్ పెట్టడమేంటని నిలదీశారు. మిగతా రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ప్రజలు కాదా? మరెక్కడా కరవు లేదా? అని ప్రశ్నించారు.
ఇది భారతదేశ బడ్జెట్, కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే బడ్జెట్ కాదని నామా చెప్పుకొచ్చారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని ప్రకటించిన కేంద్రం ఈ తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా… ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయని అన్నారు. రైల్వే ప్రాజెక్టులు అనగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంటుందనుకున్నా, తెలంగాణకు పూర్తి అన్యాయం చేశారని విమర్శించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావన లేదని వాపోయారు. మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ రూ. 24 వేల కోట్లు సిఫారసు చేసినా బడ్జెట్‌లో దాని ఊసే లేదన్నారు. ప్రాజెక్టులకు నిధులివ్వకపోగా, అనుమతులు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రాజెక్టులకు చిల్లి గవ్వ ఇవ్వకపోయినా సొంత నిధులతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణలో తలసరి ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని నామా నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టుకున్నామని వెల్లడించారు. ఇప్పటికీ 60-70 శాతం ప్రజలు గ్రామాల్లోనే ఉంటున్నా గ్రామీణాభివృద్ధి గురించి బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరమని చెప్పారు. తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి పార్లమెంటులో గట్టిగా మాట్లాడతామని నామా తెలిపారు.
నరేగాకు నిధులు తగ్గించడమేంటి?
దేశంలో వృద్ధితో పాటు పేదరికం కూడా ఉందని కేంద్ర బడ్జెట్ ద్వారా అర్థమవుతోందని ఎంపీ కె.ఆర్. సురేష్ రెడ్డి వివరించారు. ఉన్నవాడి దగ్గరే సంపద పోగై పేదరికం మరింత పెరుగుతోందని, రెండింటి మధ్య వ్యత్యాసం బాగా ఎక్కువవుతోందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి అవసరమయ్యే వాటిలో ఎరువులు ప్రధానమని కేంద్రానికి గుర్తు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగాల్లేక గ్రామాలకు తిరిగి వెళ్లిన వారికి కూడా ఉపయోగపడిందని తెలిపారు.
నరేగాకు గత ఏడాది తొలుత రూ. 73 వేల కోట్లు అనుకుంటే చివరకు అది రూ. 90 వేల కోట్లకు చేరుకుందని, అంత డిమాండ్ ఉంటే, ఈ ఏడాది బడ్జెట్‌లో తగ్గించి రూ. 60 వేల కోట్లే కేటాయించారని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మొత్తం రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ. 15 లక్షల కోట్లు అప్పులుగానే చూపుతున్నారని, అధిక భాగం వడ్డీలకే పోతోందని వివరించారు. ఆదాయం పెంచుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహిస్తే దేశ ఆదాయం పెరుగుతుందని సురేష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఉన్నత విద్య భారం కావడంతో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బడ్జెట్ అంతా అంకెల గారడీ : ఎంపీ రంజిత్ రెడ్డి
ఆర్థిక సర్వే రిపోర్ట్ చూశాక బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అనిపిస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి ఆదాయం ఎంత, కేటాయింపులు ఎంత, అప్పులు ఎంత, ద్రవ్యలోటు ఎంత అనేవి స్పష్టంగా చెప్పలేదని అన్నారు. రాష్ట్రాల అప్పు తగ్గిందే గానీ కేంద్రం అప్పు తగ్గలేదని రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూలధన వ్యయానికి రూ. 10 లక్షల కోట్లు పెట్టడం ద్రవ్యలోటును కవర్ చేసుకోవడం కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 135 శాతం తలసరి ఆదాయం పెరిగిందన్న ఆయన, అలాంటి రాష్ట్రాల కారణంగానే ఓవరాల్ దేశ తలసరి ఆదాయం పెరిగిందనే విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు.
మెడికల్ కాలేజీలు ఉన్నచోటే నర్సింగ్ కాలేజీలు ఇస్తామని మెలిక పెడుతున్నారని, తెలంగాణకు ఇంతవరకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని వాపోయారు. రూ. 16 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీకి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని వాపోయారు. సాధ్యం కాదనే వంకతో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వడం లేదని రంజిత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ బాగు పడితే దేశమే కదా బాగు పడేదన్న ఆయన, తమకు చేయూతనిస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని వెల్లడించారు.
అన్ని వర్గాల కోసం పోరాడతాం : ఎంపీ లింగయ్య యాదవ్
తెలంగాణపై మోదీ ఎప్పుడూ సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంటే మోదీ గుండెలు అదురుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో దేశంలో అన్యాయం జరిగిన అన్ని వర్గాల కోసం మాట్లాడతామని తెలిపారు.
=========
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరం – రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్
పెద్దపల్లి, ఫిబ్రవరి – 01:
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరంగా ఉందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు.
బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాసుదేవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ప్రతి వార్డును సందర్శించి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో పాటిస్తున్న పారిశుధ్యం, అందుతున్న పౌష్టికాహార వివరాలు, బయటకు మందులు రాస్తున్నారా ఆసుపత్రిలోనే అందిస్తున్నారా, డబ్బు వసూలు ఏదైనా జరుగుతుందా అనే పలు అంశాలను రోగుల నుంచి ఆరా తీశారు. ప్రభుత్వం అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రజల నుంచి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు సంతృప్తికరమైన సమాధానాలు రావడం జరిగింది. వైద్య విధాన పరిషత్ లో ఆసుపత్రి మంచి పనితీరు కనబరుస్తుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేసి డి.సి.హెచ్.ఎస్.ను, డాక్టర్ లను, అధికారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, ఆన్ డ్యూటీ డాక్టర్లు రాజు, రుక్మిణి, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు