Friday, November 22, 2024

ఏపీలో మొత్తం 6 సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్లు.. బీద మస్తాన్ రావు ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సహా మొత్తం 6 ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) వెల్‌నెస్ సెంటర్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా. భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కొత్తగా వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే ఆ నగరంలో కనీసం 6 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తూ ఉండాలనే నిబంధన ఉందని తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుని వనరుల లభ్యత, పోస్టుల సృష్టి చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6 వెల్‌నెస్ సెంటర్లు ఉన్నాయని, వాటిలో ఒకటి విశాఖపట్నంలో 2017-18లో ప్రారంభించగా, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరులో ఉన్న పోస్టల్ డిస్పెన్సరీలను 2019-20లో వెల్‌నెస్ సెంటర్లుగా మార్చామని కేంద్ర మంత్రి వివరించారు.

- Advertisement -

ఏపీలో రూ. 77,511 కోట్ల ముద్ర రుణాల మంజూరు

ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) ప్రారంభించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 77,511 కోట్ల మేర రుణాలను మంజూరు చేయగా రూ. 33,100 కోట్ల రుణాల పంపిణీ జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డా. ఘవత్ కరాడ్ రాతపూర్వత సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 31.14 లక్షల ఖాతాలకు రూ. 33,100.79 కోట్ల రూపాయణ ముద్ర రుణాల పంపిణీ జరిగిందని తెలిపారు.

2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు (పంట రుణాలు, కాలువలు, నీటిపారుదల, బావుల నిర్మాణం వంటి పనులు మినహా) చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్, ఆగ్రో పరిశ్రమలు, డైరీ, ఫిషరీ, అగ్రి-క్లినిక్‌లు మరియు వ్యవసాయ వ్యాపార కేంద్రాలు, ఆహారం మరియు వ్యవసాయ ప్రాసెసింగ్, మొదలైన జీవనోపాధిని ప్రోత్సహించే లేదా ఆదాయాన్ని సమకూర్చే సేవలను ముద్ర యోజన పరిధిలోకి తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2017-18 నుంచి ఎగువ సీలింగ్ రూ. 10 లక్షల ప్రకారం ట్రాక్టర్లు, పవర్ టిల్లర్‌ల కొనుగోలు కోసం కూడా ముద్ర రుణాలను మంజూరు చేసినట్టు తెలిపారు. 2018-19 నుంచి వాణిజ్య ప్రయోజనం కోసం ద్విచక్ర వాహనాల కొనుగోలును కూడా ముద్ర పరిధిలోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.  

పురుషోత్తం రూపాలతో భేటి.. ఆక్వా పరిశ్రమ సమస్యలపై చర్చ..

వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు భారత హేచరీస్ అసోసియేషన్ ప్రతినిధులను వెంటతీసుకుని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను కలిశారు. ఆక్వా రంగంలో ఉన్న వివిధ అంశాలను, సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. హేచరీలకు సంబంధించి పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లులోని అంశాలపై ఆక్వా పరిశ్రమలో నెలకొన్న సందేహాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో బీద మస్తాన్ రావుతో పాటు అఖిల భారత హేచరీ అసోసియేషన్ సెక్రటరీ జోషి, తమిళనాడు ప్రెసిడెంట్ కాల్ రాజ్, సెక్రెటరీ ఎలంచేరల్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement