Wednesday, January 15, 2025

Top Story – స్ట్రావా లీక్స్‌! ఫ్రాన్స్ అణు ర‌హ‌స్యాలన్నీ బ‌య‌టికి..

దాప‌రికం లేని ఫిట్‌నెస్ ట్రాకింగ్‌ యాప్‌
ఫ్రాన్స్ టాప్ సీక్రెట్స్‌ అన్నీ షేరింగ్‌
బ‌య‌ట‌ప‌డ్డ జ‌లాంత‌ర్గాముల బేస్ వివ‌రాలు
ఫ్రాన్స్‌కు చెందిన‌ నాలుగు స‌బ్‌మెరైన్‌ల డేటా లీకేజీ
ఒక్కో దానిలో 16 అను క్షిప‌ణులున్న‌ట్టు స‌మాచారం
ర‌ష్యా స‌మీపంలో గ‌స్తీకి వెళ్లాల్సిన స‌బ్ మెరైన్‌
మాస్కో చేతికి వివ‌రాలు చిక్కితే ప‌రిస్థితేంట‌ని ఆందోళ‌న‌
డేటా మొత్తం సేక‌రిస్తున్న‌ మొబైల్, స్మార్ట్ వాచ్‌లో ఉప‌యోగించే థ‌ర్డ్ పార్టీ యాప్‌
స్ట్రావా యాప్‌ని అమెరికా, ర‌ష్యా, ఫ్రాన్స్ అధ్య‌క్షుల బాడీగార్డులు కూడా ఉప‌యోగిస్తారు
వారంద‌రి క‌ద‌ల‌క‌ల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌నే అనుమానాలు
ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ఆయా దేశాల సెక్యూరిటీ సంస్థ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ‌, సెంట్ర‌ల్ డెస్క్‌:

హిరోషిమా, నాగసాకిపై వేసిన బాంబుల కంటే వెయ్యి రెట్లు శక్తిమంతమైన అణ్వాయుధాల డేటా లీకైంది. రక్షణ సిబ్బంది చేసిన ఒకే ఒక పొర‌పాటుతో ఫ్రాన్స్​ దేశానికి చెందిన ర‌క్ష‌ణ ర‌హస్యాలన్నీ బయటికి వెల్లడయ్యాయి. ఈ విష‌యాల‌న్నింటినీ యూకేకు చెందిన డెయిలీ మెయిల్ త‌న క‌థ‌నంలో తెలిపింది. సాధార‌ణంగా రక్షణ దళాల్లోని అణు జలాంతర్గాముల కదలికలు అత్యంత రహస్యంగా ఉంటాయి. అందులో ప‌నిచేసే సిబ్బందికి కూడా చివరి నిమిషం దాకా వారు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. కానీ, ఫ్రాన్స్​కు చెందిన అణు జలాంతర్గాముల బేస్ వివరాల‌న్నీ లీక‌వ‌డంతో ఇప్పుడు మ‌రింత ఆందోళ‌న నెల‌కొంది.

- Advertisement -

మాస్కో చేతికి ఫ్రాన్స్ డేటా..

ఫ్రాన్స్‌కు చెందిన ఒక్కో జ‌లాంత‌ర్గామిలో 16 అణు క్షిపణులున‌ట్టు తెలుస్తోంది. ఈ నాలుగు సబ్ మెరైన్‌లు ఎక్క‌డున్నాయ‌నే విష‌యాలు ఇప్పుడు లీక‌య్యాయి. ఈ సీక్రెట్‌ వ్యవహారం బ‌య‌ట‌కు రావ‌డానికి ఓ ఫిట్‌నెస్‌ ట్రాకింగ్ యాప్ (స్ట్రావా) కారణంగా తెలుస్తోంది. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన ఓ అణు జలాంతర్గామి సిబ్బంది, అధికారుల డేటా సహా.. వారి లొకేషన్ వివరాలు పొరపాటున లీకయ్యాయి. వాస్తవానికి ఆ సబ్ మెరైన్ రష్యా సమీపంలో గస్తీకి వెళ్లాల్సిఉంది. ఈ వివరాలు మాస్కో చేతికి చేరితే ఆ జలాంతర్గామి పరిస్థితేంటని ఫ్రాన్స్ బెంబేలెత్తిపోతోంది.

బ్రెస్టా హార్బ‌ర్‌లో జ‌లాంత‌ర్గాములు..

మొబైల్, స్మార్ట్ వాచ్‌ వినియోగించే స్ట్రావా యాప్ ఈ తతంగానికి మూలకారణంగా నిలిచింది. వాస్తవాంగా ఆ యాప్​ వినియోగదారుల ఫిట్‌నెస్ యాక్టివిటీస్​ని ట్రాక్ చేసి పర్యవేక్షిస్తుంది. అయితే.. ఆ యాప్​ వాడుతున్న వారు ఎక్కడున్నారనే అంశాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. లేటెస్టుగా ఆ యాప్​ వినియోగిస్తున్న వారిలో కొంతమంది బ్రెస్టా హార్బర్‌లో లాంగ్ ఐలాండ్ అనే ఫ్రాన్స్ సబ్ మెరైన్ బేస్‌లో ఉన్నట్టు గుర్తించింది. ఇక్కడున్న‌ నాలుగు జలాంతర్గాములు కలిపి మొత్తం 64 అణు క్షిపణులను ప్రయోగించగల కెపాసిటీ ఉంది. వీటిని బ్లాక్ బోట్స్ అంటారు.

400 మంది సిబ్బందిపై ద‌ర్యాప్తు..

1972 నుంచి ఇక్కడున్న జలాంతర్గాముల్లో ఒకటి ఎప్పుడూ గస్తీలో ఉంటుంది. ఆ సమయంలో దేశంపై అణు దాడి జరిగితే తక్షణం అధ్యక్షుడి ఆదేశాల మేరకు స్పందించే లోపే ఓ రహస్య ప్రదేశంలో కాచుకొని ఉంటుంది. లాంగ్ ఐలాండ్ బేస్‌లో మొత్తం 2,000మంది మిలటరీ సిబ్బంది పని చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఇదే టాప్ సీక్రెట్ మిలటరీ జోన్. ఇక్కడ కనీసం స్మార్ట్ ఫోన్లను కూడా వాడనివ్వరు. ఒకవేళ తీసుకెళ్లినా వాటిని స్విచ్ ఆఫ్ చేసి సిగ్నల్ ప్రూఫ్ లాకర్లలో పెట్టేస్తారు. కానీ, కొందరు సిబ్బంది మాత్రం ఫిజికల్ యాక్టివిటీని చెక్ చేసుకోవడానికి థ‌ర్డ్ పార్టీ యాప్స్ వినియోగించే స్మార్ట్ వాచ్‌ల‌ను వాడటం మొదలుపెట్టారు. ఈ యాప్​ సేకరించిన డేటా లీకయ్యాక ఫ్రాన్స్ రక్షణశాఖ అప్రమత్తమైంది. పదేళ్లుగా స్ట్రావా యాప్ వాడుతున్న దాదాపు 400 మంది సిబ్బందిపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ విషయాలన్నింటినీ యూకేకు చెందిన డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది.

లొకేష‌న్‌, టైమింగ్ అంతా బ‌య‌టికి..

ఫ్రాన్స్ పత్రిక లా మాండే కథనం ప్రకారం.. ఇక్కడ పనిచేసే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా తమ అసలు పేర్లతోనే యాప్‌లో నమోదైనట్లు తేలింది. పైగా వారి ప్రొఫౌల్‌ను పబ్లిక్ గానే ఉంచారు. ఓ అధికారి మొత్తం 16 సార్లు అణు జలాంతర్గాములున్న ప్రదేశాల్లో జాగింగ్‌కు వెళ్లినట్లు తేలింది. ఆ సమయంలో తన లొకేషన్, టైమ్‌ను రికార్డు చేశాడు. ఆ తర్వాత రెండు నెలలపాటు అతడి కార్యకలాపాలు ఆ యాప్‌లో నిలిచిపోయాయి.

అమెరికా, ర‌ష్యాకు కూడా ప్ర‌మాద‌మేనా..

ఆ తర్వాత మళ్లీ కొద్దిరోజుల‌కు ఆ అధికారి యాక్టివిటీస్ మొదలయ్యాయి. ఆ యాప్‌లో చాట్ చేస్తూ తాను రెండు నెలలపాటు ‘జీవ వ్యర్థాల బాక్స్’ (జలాంతర్గామిని ఉద్దేశించి)లోకి వెళ్లి వచ్చానని మెసేజ్ చేశాడు. దీనికి తోడు స్కూబా డైవింగ్ ఇమేజ్‌ల‌ను షేర్ చేశాడు. అయితే.. ఇదే స్ట్రావా యాప్‌ను అమెరికా, రష్యా, ఫ్రాన్స్ అధ్యక్షుల బాడీగార్డులు కూడా వాడుతున్నట్లు ఫ్రాన్స్ పత్రిక త‌న కథనంలో పేర్కొంది. దీంతో ఆయా అధ్యక్షుల కదలికలు, ట్రిప్‌ల‌ వివరాలు కూడా ఆ యాప్‌లోకి చేరుతున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement