- ఆ బూడిద విస్తీర్ణం 30 లక్షల స్విమ్మింగ్ పూల్స్‌కన్నా ఎక్కువే!
- సముద్రం ఉపరితలంపై పేరుకున్న లావా వ్యర్థాలు
- అంతరిక్షం నుంచి కన్పిస్తున్న వైనం
టోంగా : ఈ ఏడాది తొలినాళ్లలో టోంగాహుంగాలోని హాపాయ్ అగ్నిపర్వతం బద్దలైన నేపథ్యంలో వెలువడిన లావా, బూడిద, ఇతర వ్యర్థాలు సముద్రజలాలపై పేరుకుపోయిన సంఘటన ఇప్పటికీ శాస్త్రవేత్తలను విస్మయపరుస్తోంది. ఆ బూడిద పరుచుకున్న విస్తీర్ణం 7 క్యూబిక్ కిలోమీటర్లుగా అంచనా వేశారు. ఇది దాదాపు ఒలింపిక్ ప్రమాణాలతో కూడిన 30 లక్షల ఈతకొలనులకన్నా ఎక్కువగానే ఉంటుందని తేల్చారు. అంతరిక్షం నుంచి కూడా ఈ విస్ఫోటనం, ఆ తరువాత బూడిద బయటకు రావడం, సముద్రజలాల ఉపరితలంపై పరుచుకోవడం వంటి దృశ్యాలను చూడగలిగారు. అందుకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ విస్ఫోటనంతో ఆ అగ్నిపర్వతం మిగిలి ఉండకూడదు. ఆ స్థాయిలో విధ్వంసం జరిగింది. కానీ ఇప్పటికీ అది క్రియాశీలకంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
న్యూజిలాండ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వాటర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ (ఎన్‌ఐడబ్ల్యూఏ) శాస్త్రవేత్తలు టోంగా అగ్నిపరతం పేలుడు, ప్రభావంపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ఆ తరువాత మరో 8 వేల చ.కి. మేర ప్రభావం చూపిందని వారు తేల్చారు. ఆ అగ్నిపర్వతం వెదజల్లిన బూడిద కేవలం సముద్ర ఉపరితలంపైనే కాదు భూఉపరితలంపైనా పడింది. సమీప నగరాల్లో 30 మీటర్ల మేర బూడిద పేరుకుపోయింది. ఫలితంగా ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ ధంసమైంది. సముద్ర జలాలపై బూడిద పేరుకుపోవడంవల్ల పర్యావరణ, జీవవైవిధ్యంపై ఎటువంటి ప్రభావం ఉంటుందన్నదానిపై పరిశోధనలు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. అయితే ఈ బూడిదలోని ఖనిజ లవణాలు, పోషకాలు ఉన్నాయని, వాటివల్ల సముద్ర జలాల్లోని ఆల్గే జీవరాశికి మేలు జరుగుతుందని, అదే జరిగితే సముద్ర జలాలపై సరికొత్త దృశ్యం ఆవిష్కారం అవుతుందని, ఆ దృశ్యాన్ని అంతరిక్షం నుంచి కూడా చూడొచ్చని బయో కెమిస్ట్ డా. సారా సీబ్రూక్ ఓ ప్రకటనలో వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..