Saturday, November 23, 2024

రేపు మహంకాళి బోనాలు.. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌, చాంద్రాయణగుట్ట, ప్రభ న్యూస్‌ : నగరంలో బోనాల సందడి కొనసాగుతోంది. గత ఆదివారం బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. రేపు సికింద్రాబాద్‌ ఉజ్జాయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. వచ్చే ఆదివారం పాతబస్తీలోని లాల్‌ దర్వాజ బోనాల జాతర కొనసాగనుంది. అమ్మవార్లకు బోనాలతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీంతో నగర పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా షీటీమ్స్‌, స్థానికంగా ఉండే లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు, సీసీఎస్‌ సిబ్బంది, టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులతో ఎలాంటి నేరాలు జరగకుండా, మహిళలకు, భక్తులు పూర్తిస్థాయిలో రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటు-న్నారు. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ట్రాఫిక్‌ సిబ్బందికి ప్రత్యేక సలహాలు సూచనలు చేస్తున్నారు. అంతేకాదు.. ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, నిర్వాహకులు, పోలీసులతో సమన్వయ సమావేశం ఏర్పాటు- చేసి.. పటిష్టమైన బందోబస్తుకు సిద్ధం చేశారు. బోనాల ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు- చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. గత ఆదివారం జరిగిన గోల్కొండ బోనాలలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేపు జరగబోయే సికింద్రాబాద్‌ ఉజ్జాయిని మహంకాళి బోనాల ఉత్సవాలకుసైతం కట్టు-దిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామని చెప్పారు.

శుక్రవారం సింహవాహిని మహాంకాళి ఆలయంలో సీపీ ప్రత్యేక పూజలు..
పాతబస్తిలోని చారిత్రాత్మక లాల్‌ ధర్వాజ శ్రీ సింహావాహిని మహాంకాళి దేవాలయం అమ్మవారి బోనాల ఉత్సవాలు శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, సౌత్‌ జోన్‌ డీసీపీ సాయి చైతన్య కలిసి లాల్‌ధర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర్‌ పోలిస్‌ కమిషనర్‌ సివి. అనంద్‌ మాట్లాడుతూ… జాతర జరిగే ప్రాంతాలతో పాటు, చుట్టు పక్కల అన్ని ప్రాంతాలు పూర్తిస్థాయిలో కవర్‌ అయ్యేలా అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు- చేసి, వాటిని కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. అన్నివర్గాల వారు బోనాల ఉత్సవాలకు పూర్తిస్థాయిలో సహకరించాలని సీపీ సీవీ ఆనంద్‌ కోరారు. మొన్నటి వరకు జరిగిన బక్రీద్‌తో పాటు అన్నిరకాల పండుగలకు నగర ప్రజలు సహకరించారని ఈ సందర్భంగా సీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల తర్వాత నగరంలోని అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిందని, కోవిడ్‌ కారణంగా భక్తులు అంతకుముందు ఆలయాలకు పెద్దగా వెళ్లిన పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఎన్నోఏళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగాసాగే బోనాల పండుగకు భక్తులనుంచి అనూహ్య స్పందన వస్తుందని, వారి మనోభావాలు దెబ్బతినకుండా వారికి భద్రతను కల్పిస్తామని చెప్పారు. ప్రధానంగా సికింద్రాబాద్‌ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు, పాతబస్తీలోని లాల్‌ దర్వాజ బోనాల్లో అత్యధికంగా మహిళలు పాల్గొనే అవకాశం ఉండటంతో జాతరలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చైన్‌ స్నాచింగ్‌ లు జరగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. దొంగతనాలు జరగకుండా సీసీఎస్‌ నుంచి అనుభవమున్న పోలీసులను బందోస్తులో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా 24న నిర్వహించే బోనాల పండుగను శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. అంతేకాక బోనాల ఉత్సవాలనంతరం ఈ నెల 25న సాముహిక ఘట్టాల ఊరేగింపును శాంతియుతంగా చేసుకోవాలని అయన కోరారు.

ఉజ్జాయిని మహంకాళి జాతరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ..
రేపు సికింద్రాబాద్‌ ఉజ్జాయిని మహంకాళి జాతర సందర్భంగా ఆలయం చుట్టూరా ఉన్న ప్రధాన రహదారులను మూసివేసి, ఇతర మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లించేలా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆంక్షలు ఉంటాయని, అటువెళ్లే వాహనాలను దారి మళ్లింపులు ఉంటాయని సూచించారు. ప్రధానంగా ప్యారడైజ్‌ క్రాస్‌ రోడ్స్‌ వద్ద దారి మళ్లింపు చేపట్టి, ఆ మార్గంగుండా ట్రాఫిక్‌ను మహంకాళి వరకు అనుమతించరు. ఆ ట్రాఫిక్‌ ను ఎస్‌డి రోడ్డు మీదుగా క్లాక్‌ టవర్‌ వైపుకు అనుమతిస్తారు. అలాగే ప్యాటీ-్న క్రాస్‌రోడ్డు నుంచి బాటా క్రాస్‌ రోడ్డు, సుభాని రోడ్డు, మహంకాళి పోలీసు స్టేషన్‌ , ఎంజీ రోడ్డు, పాత రాంగోపాల్‌ పేట పోలీసు స్టేషన్‌కు వెళ్లు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఆ ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లో అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. బోనాల జాతర సందర్భంగా తీసుకున్న ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలకు ప్రతిఒక్కరూ సహకరించాలని నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ నగరవాసులను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బి. ఆనంద్‌, సౌత్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీ కరుణాకర్‌, ఆలయ ఫోర్మేన్‌ కమిటి ప్రతినిధులు సీరాజ్‌ కుమార్‌, సి.శీవ్‌ కుమార్‌ యాదవ్‌, పి.సుధకర్‌ ముదిరాజ్‌, బద్రినాధ్‌ గౌడ్‌, ఫలక్నుమా ఏసీపీ షేక్‌ జహాంగిర్‌, చార్మినార్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఏ ఖాదర్‌ జిలాని, చార్మినార్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. శ్రీనివాస్‌ రావు, శాలింబండా ఇన్‌స్పెక్టర్లు జి. కిషన్‌, పి. శ్రీనివాసులుతో పాటు ఆలయ సభ్యులు పి. మానిక్‌ ప్రభుగౌడ్‌, బి. బల్వంత్‌ యాదవ్‌, డీఎల్‌ నర్సింగ్‌గౌడ్‌, దూసరి నరేష్‌ గౌడ్‌, తిరుపతి, నర్సింగరావు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement