Monday, November 18, 2024

Big story | 8న చెరువుల పండుగ.. బతుకమ్మ, బోనాలతో సంబురాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సప్తవసంతాల్లో ఒకటిగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలబిందువుగా కాకతీయులు నిర్మించిన చెరువుల పునరుద్ధరణతో సస్యశ్యామలమైన తెలంగాణ చెరువుల పండుగకు సిద్ధమైంది. రాష్టంలోని 12వేల 769 గ్రామపంచాయితీల్లో చెరువుల పండుగను నేడు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చెరువుల దగ్గరలోని గ్రామదేవతల ఆలయాలదగ్గర బోనాలు, బతుకమ్మల పండుగ సంబరాలు చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ ప్రకటించి మంత్రి హరీష్‌ రావుకు బాధ్యతలు అప్పగించారు. రూ.5వేల 350 కోట్ల తో వేలాది చెరువుల పునరుద్ధరణ జరిగింది.

- Advertisement -

చెరువుల పునరజ్జీవనంతో 25లక్షల 92వేల 437 ఎకరాలు సాగులోకి రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.అలాగే రూ.3,825 కోట్లతో 12వేల చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలను ప్రభుత్వం చేట్టింది. వీటిలో 650 చెక్‌ డ్యాంల నిర్మాణం పూర్తిఅయ్యాయి. అడుగంటి పోయిన భూగర్భ జలాలు మిషన్‌ కాకతీయ, చెక్‌ డ్యాల నిర్మాణంతో భూగర్భంలో 680 టీఎంసీల నీరు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సాగునీటి పారుదల శాఖ చెరువుల పండుగకు సిద్ధం చేసింది.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లామంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు. స్థానిక చెరువులు ఏమేరకు సాగునీరు అందిసున్నాయి, కులవృత్తులకు ఏమేరకు ప్రోత్సాహం లభిస్తుందనే ప్రగతి నివేదికలను అధికారులు ప్రజలముందుంచనున్నారు. రాష్ట్రంలో నిర్వహించనున్న చెరువుల పండుగ దేశానికి ఆదర్శంగా నిలవనుందని నీటి పారుదల అధికారులు చెప్పారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement