హైదరాబాద్, ఆంధ్రప్రభ : పేద, సామాన్యులతోపాటు అన్నివర్గాల వారికి టమాట ధరలు షాక్‌మీద షాక్ ఇస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఇతర రాష్ట్రాల్లోనే కిలో టమాట 200కుపైగా ఉండేది. కాని ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ టమాట ధరలు డబుల్ సెంచరీ కొట్టాయి. పది, పదిహేను రోజుల్లో టమాట ధరలు తగ్గుతాయని ఆశతో ఎదురు చూస్తున్న సామాన్యులు టమాట ధరలు అదే పనిగా పెరుగుతుండడంతో బెంబేళెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో టమాట ధర రూ.150, రూ.160 నుంచి రూ.200కు చేరింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో టమాటా ధర రికార్డు స్థాయిలో పలికింది.
శనివారం కిలో నాణ్యమైన టమాటా కిలో రూ.196 పలికింది. అదేవిధంగా మదనపల్లె కూరగాయల మార్కెట్‌కు రోజూ 200 టన్నుల వరకే టమాట వస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ధరలు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్ల్రో దిగుబడి లేకపోవడం, మదనపల్లె ప్రాంతంలో సీజన్ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుత 25 కిలోలు ఉన్న టమాట బాక్సు ధర రూ.4వేలకు పైగా పలుకుతోంది. మరోవైపు టమాటతోపాటు అన్ని రకాల కూరగాయల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి.
ప్రస్తుతం ఏ కూరగాయ కొందామన్న కిలో రూ.80 నుంచి రూ.100కు తక్కువగా లేదని వినియోగదారులు వాపోతున్నారు. దాంతో కిలో కొనేవారు పావు కిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్లలో ఇప్పుడు కిలో వంకాయ రూ.50, బెండకాయ రూ.50, పచ్చిమిర్చి రూ. 140, కాకర రూ.80, బీరకాయ రూ.120, కాలీప్లnవర్ రూ. 80, క్యాబేజీ రూ.50, క్యారేట్ రూ.80, దొండకాయ రూ.50,ఆలుగడ్డ రూ.40, గోరుచిక్కుడు రూ.60, దోసకాయ రూ.60, సోరకాయ రూ.60, చిక్కుడు రూ.80, చామగడ్డ రూ.60, పాలకూర రూ.60, చుక్కకూర రూ.60, తోటకూర రూ.60 పలుకుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా టమాటతోపాటు అన్ని రకాల కూరగాయల ధరలు సామాన్యులను బెంబేళెత్తిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కూరగాయ పంటలు దెబ్బతినడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.