బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు టాలీవుడ్ సవాల్ విసురుతోంది. తెలుగు సినిమాలు ఉత్తరాదిలో బాక్సాఫీస్ విజయం సాధిస్తున్నాయి. అదే సమయంలో హిందీ స్టార్స్ నటించిన సినిమాలు థియేటర్ల దగ్గర కలెక్షన్లు లేక వెలవెల బోతున్నాయి. తెలుగు సినిమా ఈ స్థాయికి ఎదుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కొంతకాలంగా హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాలు మాత్రమే చుస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మారిన తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ అనే చెప్పోచ్చు.. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ భాషా బేధాన్ని చూపించరు. ‘పుష్ప’, ‘కెజిఎఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’, తాజాగా ‘కార్తికేయ 2’.. ఇలా దక్షిణాది ముఖ్యంగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో విజయం సాధిస్తున్నాయి. నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ హిందీలో విడుదలకావడమే విశేషం. అలాంటిది ఈ సినిమా సక్సెస్ సాధించి వెయ్యి థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. ప్రభాస్, అల్లు అర్జున్, యష్ వంటి హీరోలే కాదు నిఖిల్ వంటి చిన్నహీరోల దెబ్బకు బాలీవుడ్ స్టార్ హీరోలు కంగారు పడ్డారు. ఇటీవలే బాలీవుడ్ అగ్ర హీరోలు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’, ‘రక్షా బంధన్’ విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
హిందీ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఓటీటీ ద్వారా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో వాటిని కాదని థియేటర్ రిలీజ్ కు వెళ్తే ఉపయోగం లేదని, కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడా రావడం లేదని నిర్మాతలు వాపోతున్నారు. దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన థియేటర్లలో విడుదల అయితే జనాలు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు కానీ హిందీ సినిమాలను చూసేందుకు మాత్రం అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల విడుదల అయిన బాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల ఓపెనింగ్ వసూళ్లు కూడా అత్యంత దారుణంగా ఉందటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. ఒక వైపు టాలీవుడ్ సినిమాలు విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమ్రింగ్ నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అదే హిందీ సినిమా నిర్మాతల ఆలోచన మరోవిధంగా ఉంది. థియేటర్ రిలీజ్ చేస్తే వసూళ్లు రావనే భయంతో నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ పరిస్థితి కుదుట పడుతుంది. అదే పరిస్థితి బాలీవుడ్లో కూడా మొదలు అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజులు ఓపికపడితే బాలీవుడ్లో కూడా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. అందుకే టాలీవుడ్ నిర్మాతలు తీసుకోబోయే నిర్ణయాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికైతే హిందీ సినిమాలను నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ప్రమాద మే కానీ పరిశ్రమ మెరుగుపడే అవకాశం లేదని కొంతమంది నిర్మాతలు అంటున్నా రు. సినిమాలు థియేటర్లలో ఆడే పరిస్థితి రావాలని వారు అభిప్రాయపడు తున్నారు. బాహుబలి తో మొదలైన తెలుగు సినీ ప్రయాణం అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. కొద్ది రోజుల్లో పరిస్థితిలో మార్పు వస్తుం దన సినీ వర్గాలు అంచనావేస్తున్నాయి.