Tuesday, November 26, 2024

టోల్‌ బాదుడుకు మళ్లి రంగం సిద్ధం..! ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న టోల్‌గేట్‌ ఛార్జీలు

అమరావతి, ఆంధ్రప్రభ: టోల్‌ బాదుడుకు మళ్లి రంగం సిద్ధమైంది. ఒకవైపు నిత్యావరసరాల ధరల నుంచి ఇంధన ధరలు విపరీతంగా పెరిగిన తరుణంలో వాహనదారులు, ప్రజలపై మరో అదనపు భారం పడనుంది. టోల్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను నేషనల్‌ హైవే అథారిటీ సిద్ధం చేసి కేంద్ర ఉపరితల రవాణా శాఖకు అందించింది. ప్రతి ఏడాది టోల్‌ ఛార్జీల పెంపు ఆనవాయితీగా వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోల్‌ ఛార్జీల సవరణకు ఎన్‌హెచ్‌ఏఐ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వాహనదారులపై టోల్‌ ఛార్జీల భారం మరింత పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాదాపు ఐదు నుంచి పది శాతం మేర టోల్‌ ఛార్జీలను పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పెంపు ప్రతిపాదనలకు సంబంధించిన ఆదేశాలు కూడా త్వరలోనే వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1 నుంచి అంటే మార్చి 31 అర్థరాత్రి నుంచే సవరించిన ధరలు టోల్‌ ప్లాజాల్లో అమలు కానున్నాయి. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త టోల్‌గేట్‌ ధరలను ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం చేసింది. తాజాగా చేసిన ప్రతిపాదనల ప్రకారం కార్లు, జీపులు వంటి నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించి దాదాపు రూ. 10 అదనపు భారం పడే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

ఇక భారీ వాహనాలకు సంబంధించి రూ.30 నుంచి రూ.40 వరకు పెంపుదల ఉండనుంది. ఇక ఆరు యాక్సిల్‌ వాహనాలను రూ.60 నుంచి రూ.70, భారీ ట్రక్కులకు రూ.70 నుంచి రూ.80, బస్సులు, లారీలు వంటి వాహనాలకు రూ.25 నుంచి రూ.30 వరకు ఛార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్‌ హైవే అథారిటీ చేసిన ప్రతిపాదనల ప్రభావం రాష్ట్రంపై కూడా పడనుంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై మొత్తం 57 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఈ టోల్‌ ప్లాజల ద్వారా రోజుకు సగటున రూ.7.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. రూ.2 వేల 880 కోట్ల ఆదాయాన్ని ప్రతి ఏటా ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ ఛార్జీల ద్వారా ఆదాయాన్ని పొందుతోంది. తాజాగా తీసుకున్న ఛార్జీల పెంపు నిర్ణయంతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేరకు ఆదాయం రాష్ట్రంలోని టోల్‌గేట్ల ద్వారా అదనంగా ఎన్‌హెచ్‌ఏఐకు సమకూరనుంది.

రవాణా రంగంపై ఛార్జీల పెంపు ప్రభావం..

తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌గేట్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను సిద్ధం చేసిన తరుణంలో రవాణా రంగంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టోల్‌ ఛార్జీలు పెరుగుదలతో సరుకు రవాణా వాహనాల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ వరకు మార్పులు చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఆర్టీసీ ఛార్జీలతో పాటు నిత్యావసరాల ధరలపై ట్రాన్స్‌పోర్ట్‌ భారం పడనుంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ వంటి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్న తరుణంలో ఈ ప్రభావం అన్ని రంగాలపై చూపుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లిd టోల్‌గేట్‌ ఛార్జీలు కూడా ఈ భారాన్ని మరింత పెంచుతాయన్న అభిప్రాయాన్ని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

టోల్‌గేట్ల కుదింపు ఎక్కడ..?

జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్‌గేట్లను తొలగిస్తామని కేవలం మూడు నెలల్లోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గత ఏడాది కేంద్రం ప్రకటించింది. ఆనాడు కేంద్రమంత్రిగా ఉన్న నితిన్‌ గడ్కరీ ఈ అంశాన్ని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్న 57 టోల్‌ గేట్లలో 15 టోల్‌ ప్లాజాలు మూత పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం జరిగి ఏడాదైనా ఇంత వరకు 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వరుస టోల్‌గేట్ల తొలగింపుకు నోచుకోలేదు. కేవలం విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని ఒక్క టోల్‌గేట్‌ మాత్రమే తొలగించారు. మిగిలిన టోల్‌ప్లాజాలన్నీ యథావిధిగానే పనిచేస్తూ వాహనదారుల నుంచి ఛార్జీలను వసూలు చేస్తూనే ఉన్నారు. ఈ 15 టోల్‌గేట్లు 42 నుంచి 45 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నప్పటికీ తొలగింపు ఇంత వరకు పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో దీనిపై నిర్ణయం తీసుకోలేదని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement