పెట్రోల్, డీజెల్ ధరలతో సతమతం అవుతున్న వాహనదారులకు మరో షాక్ తగలనుంది. టోల్ చార్జీలు పెంచుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై ప్రయాణం మరింత ఖరీదు కానుంది. అన్ని టోల్ ప్లాజాల్లో.. కొత్త ఫీజులు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త రుసుములను ఖరారు చేస్తు ఆదేశాలు జారీ అయ్యాయి. కార్లు, జీపులు వంటి వాహనాలపై రూ.5-10 పెంచుతున్నారు. బస్సులు, లారీలకు రూ.15-25, భారీ వాహనాలకు రూ.40 నుంచి 50 టోల్ ఫీజులు పెంచనున్నారు. సింగిల్, డబుల్ ట్రిప్‌లతో పాటు నెలవారీ జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సవరించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. అయితే ఇక్కడ ఒక ఊరట అంశం కూడా ఉన్నది. హైవే ఎక్కితే అడుగడుగునా ఉంటున్న టోల్ ప్లాజాల సంఖ్య తగ్గనుంది.
దీంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడే అవకాశం తగ్గనుంది. అనవసరంగా అదనంగా డబ్బు కట్టాల్సిన ఉండదు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. 60 కి.మీ పరిధిలో రెండు ప్లాజాలు ఉండవన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాంటి వాటిని మూసేస్తామని ప్రకటించారు. మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు గడ్కరీ గతంలోనే ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..