Thursday, November 21, 2024

Big Story : నేటి తెల్లాపూర్‌, ఆనాటి తెలంగాణ పురం.. 1417లో ఫిరోజ్‌ షా వేయించిన శాసనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దశాబ్దాల నిరాధరణకు గురైన తెలంగాణలో చరిత్ర కొత్త కోణాలను ఆవిష్కరిస్తోంది. ప్రాచీన తెలంగాణపురం జాడలు వెలుగులోకి వచ్చాయి. ప్రాచీన తెలంగాణ పురం శాసనాలు వెలుగులోకి రాగానే చరిత్రకారులు తమమేధస్సుకు పదునుపెడుతూ పరిశోధనలను వేగం చేస్తున్నారు. అయితే ప్రాచీన తెలంగాణ పురం హైదరాబాద్‌కు సమీపంలో రామచంద్రాపురం పారిశ్రామిక వాడలకు దగ్గరగా ఉన్నతెల్లాపూర్‌ అని చరిత్రకారులు నిర్ధారించారు. సంబంధిత శాసనాన్ని కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి ఈ విషయానికి స్పష్టత ఇచ్చారు. అయితే తెలంగాణ పురంగా పేర్కొన్న ఈ శిలాశాసనం ఇరుకు వాడలో నిరాధరణకు గురై స్థలం కబ్జాకు బలై పోయింది. తెలంగాణ పదాలపుట్టుకతో ఆవిర్భవించిన పదం కాదు. శిలాశాసనంగా చెక్కు చెదరక నిలిచిన ఆధారం.. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన శాసనాధారలకంటే తెల్లాపూర్‌ శాసనం ప్రాచీనమైంది. తెలంగాణ పై ఉన్న శాసనాధారాలను పరిశీలిస్తే క్రీ.శ. 880-920 ప్రాంతంలో రాజశేఖరుడు త్రిలింగాధిపతిగా ప్రకటించుకున్నారు.

10 వ శతాబ్దం నాటి శాసనాల్లో తిలింగ, తెలింగ అగుపిస్తోంది. మీర్‌ ఖుస్రో తిలింగగా పేర్కొన్నారు. హేమాద్రి పండితుడు వాడిన పదాలనే ఖుస్రో వాడినట్లు చరిత్రకారులు చెపుతారు.ప్రతాపరుద్ర గజపతి వెచెర్ల శాసనంలో పశ్చాతైలుంగాణ దుర్గాన్‌ అంటూ పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు వేయించిన 2జనవరి 1517 నాటికితిరుమల శాసనంలో తెలంగాణ శబ్దం వినిపిస్తోంది. అలాగే వాల్టర్‌ హామిల్టన్‌ 1820లో హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల గురించిరాసిన దాంట్లో తెలంగాణ ప్రస్తావించలేదంటే అప్పటికే తెలంగాణపురం శాసనం శిథిలాల్లో కూరుకు పోయిుంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఇదే తెలంగాణ పురం

రాష్ట్రంపేరుతో ఊరు ఉండటం చరిత్రపరిశోధకులకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రామచంద్రాపురం పారిశ్రమిక వాడలకు దగ్గరగా ఉన్న తెలంగాణపురం(తెల్లాపూర్‌) 600 ల సంవత్సరాలక్రితమే వైభవంగా విరాజిల్లిన నగరం. గోల్కొండ రాజ్యస్థాపనకంటే 200 సంవత్సరాలముందే ఇక్కడ సిరిగల నగరం ఉన్నట్లు చరిత్రచెపుతుంది. స్వర్ణకారులు,శిల్పులు, ధనవంతుతో ఈ పట్టణం ఉండేది. 1340 హేళంబి మాఘశుద్ధ పక్షం గురువారం అంటే 28 జనవరి 1417న నేడు తెల్లాపూర్‌ గా వ్యవహరిస్తున్న తెలంగాణపురం ఉనికిని చాటుకుంది. బహమనీసుల్తాన్‌ ఫిరోజ్‌ షా తనరాజ్యాన్ని విస్తరించేక్రమంలో 1417లో విజయనగర రాజు 2వ దేవరాయలపై దాడికి బయలుదేరారు. దారిపొడుగునా ఉన్ననగరాలను ధ్వంసం చేస్తూ ముందకువెళ్లుతున్నారు. ఈ క్రమంలో తల్లాపూర్‌ సమీపానికి ఫిరొజ్‌షా రాగానే మల్లోజు వంశస్తులు ఫిరోజ్‌ షాభార్యకు బంగారు పూలదండలతో తయారుచేసిన కంఠాభరణాలు,బంగారుగాజులు బహుమతిగా ఇచ్చి శరణుకోరారు. రాజు వారిసేవలకు ముగ్ధుడై తెల్లాపూర్‌ లోని మామిడితోటలో విశ్రాంతి తీసుకున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఇక్కడ ఫిరోజ్‌ షా శాసనం వేయించారు. ఈ శాసనంలో బహుమతిగా బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు, నాగోజు, అయ్యలోజు, వల్లబోజుల పెద్దమామిడితోటలో ఉండటంతో పాటు ఇక్కడ దిగుడు బావి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని తెలంగాణ పురంగా ఆయన శాసనంలో తెలిపారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఈనగరం వర్థిల్ల నున్నట్లు శాసనంలో సూర్యచంద్రుల ఉల్భణ చిత్రాలను పేర్కొన్నారు. తెలంగాణపురం లో బంగారు పనిచేసే కళాకారులు అందమైన ఆభరణాలు చేసినట్లు తెలిపారు.అయితే ప్రస్తుతం ఈ శాసనం ఉన్నప్రాంతంలోని దిగుడుబావి పరిసరాలను మట్టితో కప్పి భవనాలను నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పురాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం తీర్చిదిద్దితే తెలంగాణచరిత్ర వైభవం మరింత ప్రాచూర్యం పొందే అవకాశం ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement